ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్’ అనే పథకం ద్వారా రైల్వే, విద్యుత్ మొదలైన రంగాలలోని ఆస్తులను లీజుకివ్వడం మొదలైన పద్దతుల ద్వారా రానున్న నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంది.
ఫాక్ట్ (నిజం): నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోని ప్రభుత్వ ఆస్తులను PPP పద్దతుల ద్వారా ప్రైవేటు రంగానికి లీజుకి ఇవ్వనుంది. ఇలా లీజుకివ్వడం ద్వారా రానున్న నాలుగేళ్ళలో దాదాపు 6 లక్షల కోట్లు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే ఈ ఆస్తుల యాజమాన్య హక్కులను మాత్రం ప్రభుత్వం వద్దే ఉంటాయి. లీజు సమయం అయిపోయినాక ఈ ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుందని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో కూడా ఎయిర్ ఇండియా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మొదలైన ప్రభుత్వ ఆస్తులును మానిటైజ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
రోడ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, స్పోర్ట్స్ స్టేడియంలు, రైల్వే స్టేషన్లు, గిడ్డంగులు మొదలైన 6 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు రంగానికి లీజుకివ్వడం ద్వారా రానున్న నాలుగేళ్ళలో దాదాపు 6 లక్షల కోట్లు నిధులు సేకరించాలనే లక్ష్యంతో అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద రూ. 0.88 లక్షల కోట్ల విలువైన ఆస్తులను మోనటైజ్ చేయాలనీ నిర్ణయించింది. నీతి ఆయోగ్ ఈ అసెట్ మోనటైజేషన్ పైప్‌లైన్‌కి సంబంధించిన విధివిధానలను రూపొందించింది. దీనికి సంబంధించిన డాకుమెంట్స్ నీతి ఆయోగ్ వెబ్సైటులో అందుబాటులో ఉన్నాయి.
ఐతే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుందని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. కానీ ఈ పథకం ద్వారా కేవలం నిర్ణీత సమయానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు/సంస్థలకు లీజుకి ఇస్తుంది, ఈ ఆస్తుల యాజమాన్య హక్కులను మాత్రం ప్రభుత్వమే వద్దే ఉంటాయి. లీజు సమయం అయిపోయినాక ఈ ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. నీతి ఆయోగ్ డాకుమెంట్స్ లో కూడా ఇలానే ఉంది.
ఆస్తుల విలువను అంచెనా వేయడానికి మార్కెట్ అప్రోచ్, కాపెక్స్ అప్రోచ్, బుక్ వ్యాల్యు అప్రోచ్ మరియు ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యు అప్రోచ్ అనే నాలుగు విధానాలను నీతీ ఆయోగ్ రూపొందించింది. ఈ పద్ధతుల ద్వారా వివిధ రంగాలలో గుర్తించిన ఆస్తులను ఆపరేట్ మెయింటైన్ ట్రాన్స్‌ఫర్ (OMT), టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (TOT), మరియు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ & డెవలప్‌మెంట్ (OMD) మొదలైన PPP పద్దతుల ద్వారా ప్రైవేటు రంగానికి లీజుకి ఇవ్వడం ద్వారా నగదును సమీకరిస్తారు.
అసెట్ మానిటైజేషన్- కాంగ్రెస్ ప్రభుత్వం:
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను మానిటైజ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. యుపిఎ హయాంలో కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వ ఆస్తులను మానిటైజ్ చేసే ప్రయత్నాలు చేసారు. ఉదాహారణకి 2014లో పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ , ఎయిర్ ఇండియా ఆస్తులను మానిటైజ్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముంబై- పూణే హైవే, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా మానిటైజ్ చేసే ప్రయత్నాలు జరిగాయని కేంద్రమంత్రి స్మ్రితి ఇరానీ అన్నారు.
చివరగా, నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్మడం లేదు, కేవలం ఈ ఆస్తులను లీజుకిస్తుంది.