ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/డీజిల్‌పై తాము విధించే ఎక్సైజ్ డ్యూటీని కొంత తగ్గించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ తగ్గింపు పూర్తిగా తమ ఖజానాకు వచ్చే సెస్‌పై కాకుండా రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీపై చేసిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై పూర్తిగా తమ ఖజానాకు వచ్చే సెస్‌పై కాకుండా రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.
ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని కాకుండా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (రోడ్డు & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్)ని తగ్గించింది. ఇందులో రాష్ట్రాలకు వాటా ఉండదు. కాకపోతే రాష్ట్రాలు విధించే VAT అనేది ఎక్సైజ్ డ్యూటీలో భాగమైన సెస్‌లపై కూడా ఆధారపడి ఉంటుంది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెస్ తగ్గించడం వల్ల, రాష్ట్రాలకు VAT రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/ డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సెస్), అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సెస్), అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (సెస్) అనే నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఈ నాలుగింటిలో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తే మిగిలిన మూడు రకాల టాక్స్‌లు సెస్/సర్చార్జీ రూపంలో విధిస్తారు.
ఐతే ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు 41% వాటా ఉంటుంది. కానీ సెస్/సర్చార్జీ రూపంలో వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. అంటే పెట్రోల్/ డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 03 నవంబర్ 2021న పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఐతే ఈ తగ్గింపు రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో కాకుండా, పూర్తిగా తమకే చెందే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (రోడ్డు & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్)పై చేసింది. ఈ తగ్గింపుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్‌లో ఈ విషయం స్పష్టంగా ఉంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇంతకు ముందు పెట్రోల్‌పై ₹18గా ఉన్న రోడ్డు & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, ఇప్పుడు చేసిన ₹5 తగ్గింపుతో ₹13 అయ్యింది. అలాగే ఇంతకు ముందు డీజిల్‌పై ₹18గా ఉన్న రోడ్డు & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, ఇప్పుడు చేసిన ₹10 తగ్గింపుతో ₹8 అయ్యింది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించలేదన్న విషయం స్పష్టమవుతుంది.
ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెట్రోల్/ డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే VAT అనేది ‘ad valorem’, అంటే రాష్ట్ర VAT పెట్రోల్/ డీజిల్‌ను డీలర్లకు విక్రయించే ధర, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ అనే మూడు అంశాలపై ఆదారాపడి ఉంటుంది. ఎలాగంటే స్టేట్ VAT= X % (ఆయిల్ కంపెనీలు పెట్రోల్/ డీజిల్‌ను డీలర్లకు విక్రయించే ధర + కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ + డీలర్ కమిషన్). ఉదాహారణకి ఢిల్లీ ప్రైస్ బిల్డ్అప్ ఇక్కడ చూడొచ్చు.
అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచినప్పుడు, దానికి అనుగుణంగా స్టేట్ VAT కూడా పెరుగుతుంది, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గినప్పుడు, స్టేట్ VAT కూడా తగ్గుతుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై 31% & 22.25% VAT విధిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ₹5 సెస్ తగ్గించింది కాబట్టి, తదనుగుణంగా రాష్ట్రానికి లీటర్ పెట్రోల్‌పై VAT రూపంలో వచ్చే ఆదాయంలో ₹1.55 తగ్గుతుంది ( ₹5 లో 31% = ₹1.55). అలాగే లీటర్ డీజిల్‌పై ₹10 సెస్ తగ్గించింది కాబట్టి, తదనుగుణంగా రాష్ట్రానికి లీటర్ డీజిల్‌పై VAT రూపంలో వచ్చే ఆదాయంలో ₹2.22 తగ్గుతుంది (₹10లో 22.25% = ₹2.22). కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉండే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించనప్పటికి, ఈ తగ్గింపు వల్ల పరోక్షంగా రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుతుంది.
చివరగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని కాకుండా సెస్‌ని తగ్గించింది.