Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం జాతీయ జెండాల తయారీ కోసం చైనా కంపెనీలకు ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు

0

భారత దేశం త్వరలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ‘మోడీ ప్రభుత్వం 75వ స్వతంత్ర దినోత్సవం కోసం జాతీయ జెండాల తయారీ చైనాకంపెనీకి ఆర్డర్ ఇచ్చిందని’ చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మోదీ ప్రభుత్వం 75వ స్వతంత్ర దినోత్సవం కోసం జాతీయ జెండాల తయారీ చైనా కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): 75 స్వతంత్ర దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జెండాల తయారీ ఆర్డర్ సిరిసిల్ల చేనేత పవర్ లూమ్ యూనిట్లకు ఇచ్చిన వార్త నిజమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ చైనా కంపెనీలకు జెండాల తయారీ ఆర్డర్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు పాలిస్టర్ జెండాల దిగుమతికి అనుమతి ఇచ్చింది. ఐతే ఈ అనుమతి వల్ల చైనా దిగుమతులు ఎక్కువై, దేశ ఖాదీ ఇండస్ట్రీ దెబ్బతింటుందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐతే కేంద్ర ప్రభుత్వం జెండాల దిగుమతికి అనుమతిచ్చిన వార్తను, కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు ఆర్డర్ ఇచ్చినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ సంవత్సరం 15 ఆగస్ట్‌తో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవనుండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీని కోసం గత సంవత్సరం నుండే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సావ్’ పేరుతో ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో భాగంగా ఆగస్ట్ 13-15 తేదీల్లో ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలని కోరుతూ ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇందుకోసం రాత్రిపూట కూడా జాతీయ జెండాను ఎగురవేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002ను’ సవరించింది. ఇంతకు ముందున్న నిబంధనల ప్రకారం కేవలం సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య మాత్రమే జెండాను ఎగురవేయాలి.

అంతకు ముందు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకు చేసిన సవరణలు:

గత సంవత్సరం డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌ను సవరించి పాలిస్టర్ జెండాలను తయారు చేసే మెషిన్లతో తయారు చేసిన జెండాలను కూడా ఉపయోగించేందుకు అనుమతి కల్పించింది. అంతకుముందు కేవలం చేతితో నేసిన మరియు నూలు/ పత్తి/ఖాదీ జెండాలకు మాత్రమే అనుమతి ఉండేది.

కేంద్ర ప్రభుత్వం వచ్చే స్వతంత్ర దినోత్సవం జెండాల కోసం చైనా కంపెనీకి ఆర్డర్ ఇచ్చిందా?

పాలిస్టర్ జెండాలకు అనుమతిస్తూ గత డిసెంబర్‌లో (2021లో) కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణకు అనుగుణంగా మెషిన్ ద్వారా తయారు చేసిన జెండాలను దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వార్తా సంస్థలు మార్చ్ 2022లో రిపోర్ట్ చేసాయి.

కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా జెండాలను దిగుమతికి అనుమతి ఇవ్వడం వల్ల చైనా దిగుమతులు పెరిగి, భారత ఖాదీ పరిశ్రమ దెబ్బతింటుందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఖాదీ జాతీయ జెండాలను ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ పొందిన ఏకైక యూనిట్ అయిన కర్ణాటకకు చెందిన ‘ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం’ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా జులై 30న ‘ధ్వజ సత్యాగ్రహం’ నిర్వహించనుంది. రాజకీయ పార్టీలు కూడా వీరికి మద్దతునిచ్చారు.

ఐతే కేంద్ర ప్రభుత్వం గతంలో పాలిస్టర్ జెండాల దిగుమతికి అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ముడిపెట్టి, కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు జెండాల ఆర్డర్ ఇచ్చిందని తప్పుడు వార్తలు షేర్ చేస్తున్నారు. పోస్టులో చేస్తున్న వాదన ఇలాంటిదే.

కానీ, నిజానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సావ్’ కోసం ప్రత్యేకంగా జెండాల తయారీ కోసం ఏ చైనా కంపెనీకి ఆర్డర్ ఇవ్వలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు.

తెలంగాణ ప్రభుత్వం జెండాల ఆర్డర్ సిరిసిల్ల చేనేత పవర్ లూమ్ యూనిట్లకు ఇచ్చింది:

75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగానంగా 1.2 కోట్ల జెండాలను పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ జెండాల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్లకు చెందిన పవర్ లూమ్ యూనిట్లకు అందించింది.  

చివరగా, 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ జెండాల తయారీ కోసం చైనా కంపెనీలకు ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll