Fact Check, Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలలో రాష్ట్రాలు చేసిన అప్పులు లెక్కించరు

0

అన్ని రాష్ట్రాలు చేసిన అప్పులు కేంద్రం చేసిన అప్పుల లెక్కలలోకి వస్తాయని, తెలంగాణ రాష్ట్ర అప్పు 3 లక్షల కోట్లు కూడా అందులో భాగమేనని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాష్ట్రాలు చేసిన అప్పులు కూడా కేంద్రం చేసిన అప్పుల లెక్కలలోకి వస్తాయి.

ఫాక్ట్(నిజం): 2020-2021 బడ్జెట్ లెక్కల ప్రకారం 31 మార్చ్ 2020 నాటికల్లా కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 100,18,120.51 కోట్లుగా ఉంది, ఇదే 2014లో రూ. 55,87,149.33గా ఉండేది. ఒక గవర్నమెంట్ తెచ్చిన అప్పుని వేరే గవర్నమెంట్ తెచ్చిన అప్పుతో పోల్చలేము. 2014 నుండి భారత దేశ అప్పులో పెరుగుదల సాధారణంగానే ఉంది. అప్పులనేవీ దేశంలోని ఆర్ధిక అవసరాలు, ఇంతకుముందు తెచ్చిన అప్పులపై వడ్డీ కట్టడం, మారుతున్న ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. 2019 చివరినాటికి అన్ని రాష్ట్రాల అప్పు కలిపి రూ. 47,86,769.5 కోట్లుగా ఉంది, 2021 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ మొత్తం రూ. 59,89,360.4 కోట్లు. రాష్ట్రాలు చేసిన అప్పులు కేంద్ర అప్పుల్లో భాగమన్న వాదనలో నిజం లేదు, కేంద్రం మరియు రాష్ట్రాల అప్పులు రెండు వేరు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2020-2021 బడ్జెట్ లెక్కల ప్రకారం 31 మార్చ్ 2020 నాటికల్లా భారత దేశ మొత్తం అప్పు (ఇంటర్నల్ + ఎక్సటర్నల్) రూ. 100,18,120.51 కోట్లుగా ఉంది, ఇందులో ఇంటర్నల్ అప్పు రూ. 97,25,253.66 కోట్లు కాగా ఎక్సటర్నల్ అప్పు 2,92,866.85 కోట్లుగా ఉంది. బాండ్స్ ద్వారాగాని, ట్రెజరీ బిల్లుల ద్వారా గాని చేసిన అప్పులు మొదలైనవి కలిపి ఇంటర్నల్ అప్పు అంటారు. వరల్డ్ బ్యాంకు వంటి ఫైనాన్సియల్ సంస్థలు, విదేశాల నుండి తెచ్చిన అప్పుని ఎక్సటర్నల్ అప్పు అంటారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లెక్కల ప్రకారం 2021 మార్చ్ చివరికల్లా కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం అప్పు రూ. 106,36,983.95 కోట్లు ఉంటుందని అంచనా. ఐతే మార్చ్ 2014 చివరికల్లా భారత దేశం యొక్క మొత్తం అప్పు రూ. 55,87,149.33గా ఉండేది. సాధారణంగా ప్రతీ సంవత్సరం ప్రభుత్వం చేసే అప్పు ఒకేలా ఉండదు. ఇంతకుముందు తెచ్చ్చిన అప్పులపై వడ్డీ కట్టడం, దేశంలోని ఆర్ధిక అవసరాలు, మారుతున్న ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. 2014 నుండి భారత దేశ అప్పులో పెరుగుదల సాధారణంగానే ఉంది.

2019 చివరినాటికి అన్ని రాష్ట్రాల అప్పు కలిపితే మొత్తం రూ. 47,86,769.5 కోట్లుగా ఉంది. 2021 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ మొత్తం రూ. 59,89,360.4 కోట్లు. వివిధ రాష్ట్రాలు తమ అవసరాల కోసం FRBM నిబంధనలకు లోబడి బ్యాంకులు, కేంద్ర రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం మొదలైన దగ్గర అప్పులు తీసుకుంటాయి. FRBM నిబంధనలు దాటి అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఐతే కేంద్రం చేసే అప్పులలో రాష్ట్రాలు చేసే అప్పులను కలపరు. రాష్ట్రాలు చేసే అప్పులకి కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉదాహరణకి, కేంద్ర ప్రభుత్వ అప్పుల వివరాలు ఇక్కడ చూడొచ్చు, ఇందులో రాష్ట్రాలు చేసిన అప్పులను కేంద్ర అప్పులలో కలపక పోవడం గమనించొచ్చు.

రాష్ట్ర మరియు కేంద్ర ఆర్ధిక విషయాలు అదుపులో ఉంచడానికి తీసుకు వచ్చిన FRBM చట్టాన్ని రివ్యూ చేయడానికి 2017లో ఏర్పాటు చేసిన N.K.Singh కమిటి చేసిన ప్రతిపాదనలు 2018లో కేంద్రం ఆమోదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం (1) కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాల అప్పు కలిపి GDP లో 60% మించకూడదు. (2) 2024-2025 చివరికల్లా కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు GDPలో 40% మించకూడదు. (3) అన్ని రాష్ట్రాల అప్పు GDPలో 20% మించకూడదు.

దేశంలోని పెద్ద రాష్ట్రాలలో అప్పులు వారి వారి GDPలో ఎంత శాతమో కింద చార్టులో చూడొచ్చు.

చివరగా, పోస్టులో చెప్తున్నట్టు రాష్ట్రాలు చేసిన అప్పులను కేంద్రం చేసిన అప్పులలో కలపరు, రాష్ట్రాలు చేసిన అప్పులను, కేంద్రం చేసిన అప్పులను వేరు వేరుగా లెక్కిస్తారు.

Share.

About Author

Comments are closed.

scroll