Fake News, Telugu
 

ఫోన్‌లో తగినంత అవుట్‌గోయింగ్ బ్యాలెన్స్ ఉంటేనే Wi-Fi calling ద్వారా కాల్స్ చేయగలము

0

“మీ ఫోన్‌/ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్/వైఫై కాలింగ్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: స్మార్ట్‌ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కాలింగ్ (Wi-Fi calling) ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

ఫాక్ట్(నిజం): మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కాలింగ్ (Wi-Fi calling) ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు అనే వాదనలో నిజం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో అవుట్‌గోయింగ్ (outgoing) బ్యాలెన్స్ అనగా కాల్స్ చేయడానికి సరిపడా బ్యాలెన్స్ ఉంటేనే Wi-Fi calling ద్వారా కాల్స్ చేయవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

Wi-Fi కాలింగ్ అంటే ఏంటి?

Wi-Fi కాలింగ్ అనేది మొబైల్ నెట్‌వర్క్‌కు బదులుగా Wi-Fi నెట్‌వర్క్ ద్వారా కాల్స్, టెక్స్ట్‌ చేయగలిగే, స్వీకరించగలిగే ఫీచర్. మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోయినా, ఇంటర్నెట్/WiFi ద్వారా మీరు స్పష్టమైన వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ సరిగాలేని ప్రదేశాలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి కాల్స్ చేయడానికి టెలికాం ప్రొవైడర్ మొబైల్ నెట్‌వర్క్‌కు బదులుగా Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. మీరు WiFi కనెక్షన్‌తో కనెక్ట్ అయ్యీ ఉన్నంత వరకు, ఫోన్ కాల్స్ చేయడం మరియు స్వీకరించడం కుదురుతుంది. మీ ఫోన్లో మొబైల్ డేటా లేకున్నా WiFi ఉన్నచోట కాలింగ్ చేయవచ్చు. Wi-Fi కాలింగ్ అనేది టెలికాం ప్రొవైడర్ నుంచి ఆటోమెటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. మన దేశంలో ఎయిర్‌టెల్, జియో, వీఐ వంటి అన్ని ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌లు తమ కస్టమర్‌లకు Wi-Fi కాలింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నాయి. 

రీఛార్జ్/బాలన్స్ లేకున్నా Wi-Fi కాలింగ్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చా?

లేదు. స్మార్ట్‌ఫోన్‌లో తగినంత అవుట్‌గోయింగ్ (outgoing) బ్యాలెన్స్ లేకుండా Wi-Fi కాలింగ్ ద్వారా కాల్స్ చేయలేము. Wi-Fi కాలింగ్ అనేది VoLTE (వాయిస్ ఓవర్ LTE) టెక్నాలజీకి బదులుగా VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) టెక్నాలజీని ఉపయోగించి కాల్‌లను కనెక్ట్ చేస్తుంది. అంటే మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా కాల్ డ్రాప్స్ సమస్య లేకుండా మీరు సాధారణ ఫోన్ కాల్స్ చేయవచ్చు.

చాలా టెలికాం ఆపరేటర్లు/నెట్‌వర్క్ ప్రొవైడర్లు సాధారణ వాయిస్ కాల్‌లకు వసూలు చేసే ఛార్జిలనే Wi-Fi కాలింగ్‌కు కూడా వసూలు చేస్తారు. ఒకవేళ మీ ఫోన్‌లో సాధారణ రెగ్యులర్ వాయిస్ కాల్స్ చేయడానికి తగినంత బ్యాలెన్స్/రీఛార్జ్ లేకపోతే, మీరు Wi-Fi కాలింగ్ ద్వారా కూడా కాల్స్ చేయలేరు. ఇదే విషయం Airtel, Jio, VI వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌ల వెబ్‌సైట్‌లో వైఫై కాలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

అలాగే మేము స్వయంగా వివిధ నెట్‌వర్క్‌ల సంబంధించిన  సిమ్‌లను (అవుట్‌గోయింగ్ బ్యాలెన్స్‌ కలిగి ఉన్నవి, లేనివి) ఉపయోగించి వైఫై కాలింగ్‌ను పరీక్షించాము, వైఫై కాలింగ్ కేవలం అవుట్‌గోయింగ్ బ్యాలెన్స్ ఉన్న సిమ్‌లు/నంబర్‌లలో మాత్రమే పనిచేసింది.

చివరగా, స్మార్ట్‌ఫోన్‌లో అవుట్‌గోయింగ్ (outgoing) బ్యాలెన్స్ అనగా కాల్స్ చేయడానికి సరిపడా బ్యాలెన్స్ ఉంటేనే Wi-Fi calling ద్వారా కాల్స్ చేయవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll