Fake News, Telugu
 

ఈ వీడియోలో స్కేటర్స్ డాన్స్ చేసింది బాలీవుడ్ పాటలకు, శివ స్తోత్రానికి కాదు

0

శివతాండవ స్త్రోత్రానికి స్కేటింగ్ ద్వారా మహాద్భుతంగా నృత్యం చేసిన కళాకారులంటూ ఒక వీడియోను షేర్ చేస్తున్న  పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కళాకారులు శివతాండవ స్త్రోత్రానికి స్కేటింగ్ ద్వారా నృత్యం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ దృశ్యాలు 2010 ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన డేవిస్/ వైట్ చేసిన ప్రదర్శనకు సంబంధించినవి. ఐతే ఈ ప్రదర్శనలో వీళ్ళు డాన్స్ చేసింది బాలీవుడ్ పాటలకు, శివ స్తోత్రానికి లేక మరేదో హిందూ భక్తి పాటలకు కాదు. ఈ విషయాన్ని చాలా మీడియా కథనాలు కూడా రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను పరిశీలిస్తే వీడియో మొదట్లో స్క్రీన్‌పైన ‘Davis/White, 2010 AT & T U.S. Championship’ అని రాసి ఉండడం గమనించొచ్చు. దీని ఆధారంగా యూట్యూబ్‌లో వెతకగా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి ఫుటేజ్ మాకు లభించింది.

ఈ యూట్యూబ్‌ వీడియో వివరణ ప్రకారం ఈ దృశ్యాలు 2010లో జరిగిన ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌కి సంబంధించినవని తెలుస్తుంది. ఐతే ఈ వీడియోలో ఆ ఇద్దరు స్కేటర్స్ డాన్స్ చేస్తుంది బాలీవుడ్ పాటలకు, శివ స్తోత్రానికి కాదు.

మరింత సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా 2010 ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాలలో కూడా అమెరికన్ ఫిగర్ స్కేటర్స్ డేవిస్ మరియు వైట్ బాలీవుడ్ పాటలకు (‘కజ్రారే’, ‘సిల్సిలా యే చాహత్ కా’, ‘డోలా రే డోలా) స్కేటింగ్ చేసినట్టు రిపోర్ట్ చేసారు.

వీరిద్దరు 2010 వింటర్ ఒలింపిక్స్‌లో కూడా బాలీవుడ్ పాటలకు డాన్స్ చేసినట్టు కథనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ సమాచారం బట్టి డేవిస్/ వైట్ 2010 ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ ప్రదర్శన వీడియోకు శివ స్తోత్రాన్ని డిజిటల్‌గా జోడించి, వీరు నిజంగానే శివ స్తోత్రానికి డాన్స్ చేసినట్టు క్లెయిమ్ చేసినట్టు అర్ధమవుతుంది. గతంలో కూడా ఇవే దృశ్యాలను కృష్ణుడి పాటలకు డాన్స్ చేసినట్టు షేర్ చేసారు.

చివరగా, ఈ వీడియోలో స్కేటర్స్ డాన్స్ చేసింది బాలీవుడ్ పాటలకు, శివ స్తోత్రానికి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll