మనం వాడే మందులు అసలైనవో లేదా నకిలీవో తెలుసుకునే విధానం గురించి చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ప్యాకింగ్‌పైన ఉండే ప్రత్యేకమైన సంఖ్యను ‘9901099010’ నెంబర్‌కు మెసేజ్ చేసినట్లయితే మందు యొక్క బ్యాచ్ నెంబర్, ఫార్మా కంపెనీ తదితర వివరాలను రిప్లై ఇస్తారని, ఒకవేళ ఈ వివరాలు ప్యాకింగ్‌పైన ఉండే వివరాలు ఒకటే అయితే మందులు అసలైనవనీ, లేనిపక్షంలో మందులను నకిలీగా నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. నకిలీ మందులు వస్తే అదే నెంబర్‌కి ఫిర్యాదు చేయవచ్చని కూడా పోస్టులో చెప్పబడింది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: మందులు అసలైనవా లేదా నకిలీవా అని తెలుసుకునే విధానం.
ఫాక్ట్: పోస్టులో ఇచ్చిన నెంబర్ ‘PharmaSecure’ అనే ప్రైవేట్ కంపెనీకి చెందినది. ఈ కంపెనీ కొన్ని ఫార్మా కంపెనీలతో కలిసి పని చేస్తుంది. అందులో భాగంగా ఆయా కంపెనీల ఉత్పత్తులపైన ప్రత్యేకమైన కోడ్ లను ముద్రిస్తారు. ఈ కోడ్‌ని వినియోగదారులు ‘9901099010’ నెంబర్‌కి మెసేజ్ చేయడం ద్వారా మందులు ప్రామాణికతను తెలుసుకోవచ్చు. అయితే ఈ పద్దతి అన్నీ మందులకు పనిచేయదు, కేవలం ఈ కంపెనీతో పని చేసే కొన్ని ఫార్మా కంపెనీ ఉత్పత్తులను మాత్రమే ఈ పద్దతి ద్వారా పరీక్షించవచ్చు. అంతే కాదు, ఈ నంబర్ ద్వారా ఫిర్యాదులు కూడా చేయలేము. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇదే విషయం గురించి మే 2014 లో Reuters ప్రచురించిన వార్తా కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, నకిలీ మందులను గుర్తించడానికి ‘pharmaSecure’ అనే కంపెనీ కొన్ని మందుల తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా, మందుల ప్యాకింగ్‌పైన ఒక ప్రత్యేకమైన కోడ్‌ని ముద్రిస్తారు. ఈ కోడ్‌ని ‘9901099010’ నెంబర్‌కి మెసేజ్ చేస్తే ఆయా ట్యాబ్లెట్లు లేదా మందులు అసలైనవా లేదా నకిలీవా అని రిప్లై వస్తుంది.
దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘PharmaSecure’ కంపెనీని మేము ఈ- మెయిల్ ద్వారా సంప్రదించాము. వారు మేము అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, పోస్టులో పేర్కొన్న నెంబర్ ‘9901099010’ తమ కంపెనీకి చెందినదేనని నిర్ధారించారు. అయితే తాము ఒప్పందం చేసుకున్న ఫార్మా కంపెనీల ఉత్పత్తుల పైన ఉండే ప్రత్యేకమైన కోడ్‌ను ఈ నెంబర్‌కు మెసేజ్ చేసినప్పుడు మాత్రమే అది అసలైనదా లేక నకిలీదా అనేది రిప్లై వస్తుంది అని, ఇతర కంపెనీల మందులను ఈ పద్ధతి పని చేయదని వారు స్పష్టం చేశారు. ఉదాహరణకు, కింద కనిపించే విధంగా ప్యాకింగ్ పైన ముద్రించి ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్దతి ద్వారా మందులు ప్రామాణికతను తెలుస్తుంది.
ఇక తమది ప్రభుత్వ రంగ సంస్థ కాదని, నకిలీ మందులపై వచ్చే ఫిర్యాదులని పరిష్కరించడం తమ పని కాదని, కేవలం తమ క్లయింట్లకు సంబంధిత సమాచారం అందించడం వరకే తమ బాధ్యతని చెప్పారు.
అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, మందుల ప్రామాణికతను తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం త్వరలో ఒక సేవను అందుబాటులోకి తేనుంది. ఇందులో భాగంగా, అత్యధికంగా అమ్ముడయ్యే 300 మందుల ప్యాకింగ్ పైన ‘QR code’ ని ముద్రించాలని ఆయా మందుల తయారీ కంపెనీలను ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఇప్పటికే పరీక్షిస్తున్నారు.
చివరిగా, నకిలీ మందులను కనిపెట్టేందుకు పోస్టులో ఇచ్చిన నెంబర్ ‘9901099010’ అన్ని మందులకు పనిచేయదు.