Fake News, Telugu
 

కర్ణాటకలో సవరించిన పాఠ్యపుస్తకాలను డీ.కే.శివకుమార్ చింపేసిన పాత వీడియోను ఇప్పటిదంటూ షేర్ చేస్తున్నారు

0

ఎన్నికల్లో గెలిచిన అనంతరం డీ.కే. శివ కుమార్, అంతకుముందు బొమ్మయ్ ప్రభుత్వం సవరించిన పాఠ్యపుస్తకాల కాపీని చింపివేసిన వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘BJP ముఖ్యమంత్రి బొమ్మయ్ ప్రవేశ పెట్టిన పాఠ్యపుస్తకాల్లో సావర్కర్ పాఠం ఉండబోదు, డార్విన్ సిద్ధాంతం యధావిధిగా ఉంటుంది’ అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్:  ఎన్నికల్లో గెలిచిన అనంతరం డీ.కే. శివ కుమార్, అంతకుముందు బొమ్మయ్ ప్రభుత్వం సవరించిన పాఠ్యపుస్తకాల కాపీని చింపివేసిన వీడియో.

ఫాక్ట్(నిజం): బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో సవరణలు చేయడాన్ని నిరసిస్తూ జూన్ 2022లో జరిగిన ఒక సభలో డీ.కే.శివకుమార్ సవరించిన పాఠ్యపుస్తకం కాపీని చించివేసారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఈ సందర్భానికి సంబంధించిందే. ఐతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సవరించిన పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2020లో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీని ఏర్పాటు చేసింది. 1 నుండి 10 తరగతులకు కన్నడ భాషా పాఠ్యపుస్తకాలు మరియు 6 నుండి 10 తరగతులకు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను సవరించేలా ఈ కమిటీని ఏర్పాటు చేసారు.

ఐతే RSS వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చేసిన ప్రసంగం 10వ తరగతి కన్నడ పాఠ్యపుస్తకంలో చేర్చడం. అలాగే భగత్ సింగ్, టిప్పు సుల్తాన్, బసవన్న, పెరియార్, స్వామి వివేకానందను మొదలైన వారి పాఠ్యాంశాలను తొలగించడం లేదా వక్రీకరించడం జరిగిందని కొన్ని కథనాలు రిపోర్ట్ చేయడంతో ఈ పాఠ్యపుస్తకాల రివిజన్‌పై వివాదం నెలకొంది. ఆ తరువాత కర్ణాటక ప్రభుత్వం ఈ సవరణలలో కొన్ని మార్పులు చేసింది.

ఈ క్రమంలోనే జూన్ 2022లో కర్ణాటకలోని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేసిన సవరణలకు నిరసనగా KPCC చీఫ్ డీ.కే.శివకుమార్ ఒక సభలో సవరించిన పాఠ్యపుస్తకం కాపీని చించివేసారు. అప్పుడు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ప్రస్తుతం వైరల్ అవుతున్నది ఈ సందర్భానికి సంబంధించిందే. కాని ఈ వీడియోను ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందంటూ షేర్ చేస్తున్నారు. ఐతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సవరించిన పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

చివరగా, కర్ణాటకలో సవరించిన పాఠ్యపుస్తకాలను డీ.కే.శివకుమార్ చింపేసిన పాత వీడియోను ఇప్పటిదంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll