Fake News, Telugu
 

BC రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం ద్వారా దళిత, బలహీన హిందూ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పేర్కొనలేదు

0

“SC రిజర్వేషన్ల లోకి క్రైస్తవులు దూరిపోయారు.. ఇప్పుడు BC రిజర్వేషన్ల లోకి ముస్లింలు వచ్చేశారు.. నిజంగా లబ్ధి పొందాల్సిన హిందూ దళిత సామాజిక వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుంది.. ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి- మాయావతి (BSP పార్టీ అధ్యక్షులు)” అని పేర్కొంటున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: SC రిజర్వేషన్లలోకి క్రైస్తవులను, BC రిజర్వేషన్లలోకి ముస్లింలను చేర్చడం ద్వారా హిందూ దళిత సామాజిక వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుంది, ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి- BSP అధ్యక్షురాలు మాయావతి.

ఫాక్ట్(నిజం): BC రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం ద్వారా దళిత, బలహీన హిందూ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి చెప్పినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఆమె ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా ముస్లింలకు ఓబీసీ (OBC) రిజర్వేషన్లను కల్పించడాన్ని మాయావతి సమర్థించింది. అలాగే ఓబీసీ (OBC) లకు ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్లను పెంచి పేద ముస్లింలకు కూడా జనాభా ఆధారంగా రిజర్వేషన్లను పెంచాలని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్ట్‌లో ముందుగా పేర్కొన్నట్లుగా, BC రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం ద్వారా దళిత, బలహీన హిందూ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి అన్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆమె ఇలాంటి  వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు/రిపోర్ట్స్  లభించలేదు. ఒక వేళ మాయావతి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి.

అలాగే మేము మాయావతికి, బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా పరిశీలించాము, అక్కడ కూడా మాయావతి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు.

ఈ క్రమంలోనే, ముస్లింలకు, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాయావతి గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే, ముస్లింలకు ఓబీసీ (OBC) రిజర్వేషన్లను కల్పించడాన్ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సమర్థించినట్లు చెప్తున్న పలు వార్తా కథనాల లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

అలాగే ఓబీసీ (OBC) లకు ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్లను పెంచి పేద ముస్లింలకు కూడా జనాభా ఆధారంగా రిజర్వేషన్లను పెంచాలని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు (ఇక్కడ & ఇక్కడ).

అలాగే, ఇదే విషయమై మేము బహుజన్ సమాజ్ పార్టీ వర్గాలను సంప్రదించాము, వారి నుండి సమాధం రాగానే ఈ కథనం అప్డేట్ చేయబడుతుంది. 

ప్రస్తుతం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముస్లింలకు OBC కేటగిరీలో రిజర్వేషన్లు ఇస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ముస్లింలకు BC-E కేటగిరీ కింద 4% రిజర్వేషన్లు ఇస్తున్నారు.

చివరగా, BC రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం ద్వారా దళిత, బలహీన హిందూ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll