Fake News, Telugu
 

భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తాను క్రిస్టియన్ అని ప్రకటించలేదు

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి తానే స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌లో క్రిస్టియన్ అని వెల్లడించాడని చెప్తూ, అతని మత విశ్వాసాలపై ప్రస్తావిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భూమన కరుణాకర్ రెడ్డి తానే స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌లో క్రిస్టియన్ అని వెల్లడించాడు.

ఫాక్ట్(నిజం): భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తాను క్రిస్టియన్ అని ఎక్కడా ప్రకటించలేదు. సాధారణంగా ఎన్నికల అఫిడవిట్‌లో ఒక అభ్యర్థి తన మత విశ్వాసాల గురించి ప్రస్తావించరు. కరుణాకర్ రెడ్డి కూతురు నీహా రెడ్డి వివాహం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ రవీంద్రారెడ్డి కుమారుడితో జరిగింది. ఐతే వైఎస్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడం వల్ల ఈ పెళ్లి క్రైస్తవ పద్దతిలో జరిగింది. కాని భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం హిందూ మతాన్నే ఆచరిస్తున్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించింది. ఐతే ఈ ప్రకటన అనంతరం కరుణాకర్ రెడ్డి మత విశ్వాసాలపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే  భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను క్రిస్టియన్ అని ప్రకటించుకున్నాడని ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్ట్‌లో చెప్తున్నారు.

కాని కరుణాకర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తాను క్రిస్టియన్ అని ఎక్కడా ప్రకటించలేదు. సాధారణంగా ఎన్నికల అఫిడవిట్‌లో ఒక అభ్యర్థి తన మత విశ్వాసాల గురించి ప్రస్తావించరు. ఉదాహరణకు కరుణాకర్ రెడ్డి మరియు ఇతరుల ఎన్నికల అఫిడవిట్‌లు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ప్రస్తుత వివాదం నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి తన కూతురి వివాహం క్రైస్తవ పద్దతిలో చేసాడని కూడా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఐతే ఈ విషయానికి సంబంధించి ప్రచురితమైన కథనాల ప్రకారం కరుణాకర్ రెడ్డి కూతురు నీహా రెడ్డి వివాహం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ రవీంద్రారెడ్డి కుమారుడితో జరిగింది. ఐతే వైఎస్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడం వల్ల ఈ పెళ్లి క్రైస్తవ పద్దతిలో జరిగింది.

కాగా భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఇప్పటికి హిందూ మతాన్నే ఆచరిస్తున్నాడు. అయన కుమారుడి పెళ్లి కూడా హిందూ పద్దతిలోనే జరిగింది, దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. ఈయన గతంలో 2006 నుండి 2008 వరకు కూడా టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించాడు.

చివరగా, భూమన కరుణాకర్ రెడ్డి తన కూతురి వివాహం క్రైస్తవ పద్దతిలో చేసినప్పటికీ తాను మాత్రం ఇప్పటికి హిందూ మతాన్నే ఆచరిస్తున్నాడు.  

Share.

About Author

Comments are closed.

scroll