Fake News, Telugu
 

వివిధ నృత్య కళాకారుల ప్రదర్శన వీడియోలని చైనా రోబోలు షాంఘై డిస్నీల్యాండ్‌లో నృత్యం చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

చైనా రూపొందించిన రోబోలు షాంఘై డిస్నీల్యాండ్‌లో చైనీస్ శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. కేవలం, అయిదు నిమిషాల వ్యవధి గల ఈ నృత్య ప్రదర్శనను వీక్షించడానికి 499 యువాన్లు అంటే, భారత కరెన్సీ ప్రకారం 5,600 రూపాయిల టికెట్ ధర ఉంటుందని ఈ పోస్టులో అంటున్నారు.  దీంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: చైనా రూపొందించిన రోబోలు షాంఘై డిస్నీల్యాండ్‌లో నృత్య ప్రదర్శన చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో నృత్య ప్రదర్శన చేస్తున్నది రష్యా దేశానికి చెందిన బచాట నృత్య కళాకారులు డిమ్ డేవిడ్ ఆఫ్ మరియు డిలార. 2020లో మాస్కో నగరంలో జరిగిన ‘బచాట స్టార్ వీక్’ ఈవేంట్లో ‘డిమాడిలార’ జంట ఈ నృత్య ప్రదర్శన చేసారు. ఈ వీడియోలో నృత్యం చేస్తున్నది చైనా రోబోలు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని డాన్ కోరజోన్ అనే బచాట డిజే నిర్వాహకుడు 17 ఆగష్టు 2020 నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో నృత్య ప్రదర్శన చేస్తున్నది బచాట నృత్య కళాకారులు డిమా మరియు డిలార అని డాన్ కోరజోన్ తెలిపారు. 16 ఆగష్టు 2020 నాడు రష్యా దేశం మాస్కో నగరంలో జరిగిన ‘బచాట స్టార్ వీక్’ ఈవెంట్లో డిమాడిలార జంట ఈ నృత్య ప్రదర్శన చేసినట్టు వీడియో వివరణలో తెలిపారు.

డిమ్ డేవిడ్ ఆఫ్ మరియు డిలార రష్యా దేశానికి చెందిన ప్రముఖ బచాట నృత్య కళాకారులని తెలిసింది. ‘డిమాడిలార’(dimadilara)గా పిలవబడే ఈ జంట పార్టీలు, వర్క్ షాప్స్‌లలో బచాట నృత్య కళని ప్రదర్శిస్తుంటారని తెలిసింది. అంతేకాదు, ఈ జంట బచాట నృత్య కళకి శిక్షణ కూడా ఇస్తుందని వారి వెబ్సైటులోని రాసిన వివరణ బట్టి తెలిసింది.

మాస్కో ‘బచాట స్టార్ వీక్’ ఈవెంట్లో తాము చేసిన నృత్య ప్రదర్శన వీడియోలని ఈ జంట తమ యూట్యూబ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలలో షేర్ చేసింది. ఈ ప్రదర్శన వీడియోని డిలార కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజిలో కూడా షేర్ చేసింది. ‘డిమాడిలార’ జంట చేసిన మరికొన్ని నృత్య ప్రదర్శన వీడియోలని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో నృత్య ప్రదర్శన చేస్తున్నది డిమా మరియు డిలార అనే బచాట నృత్య కళాకారులని, చైనా రూపొందించిన రోబోలు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అప్డేట్ (MARCH 01, 2022):

అదే క్లెయిమ్ ఉన్న మరో వీడియో కూడా తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అందులో నృత్య ప్రదర్శన చేస్తున్న వారు కూడా రోబోలు కాదని తెలిసింది. ‘ఇండియన్ రాగా’ అనే యూట్యూబ్ ఛానల్ వారు అలాంటి వీడియోనే 2017లో పోస్ట్ చేసి, అందులో నృత్యం చేస్తున్న నృత్య కళాకారుల పేర్లను వీడియో వివరణలో రాసినట్టు ఇక్కడ చూడవచ్చు. వారి పేర్లు – సోఫియా సలింగరోస్, ఇషా పారుపూడి.

చివరగా, వివిధ నృత్య కళాకారులు చేసిన ఒక నృత్య ప్రదర్శన వీడియోలని చైనా రోబోలు నృత్య ప్రదర్శన చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll