Fake News, Telugu
 

ADR సంస్థ 83% లోక్‌సభ ఎంపీలు కోటీశ్వరులు అని నివేదిక ఇచ్చింది, అవినీతిపరులని కాదు

0

‘83% లోక్‌సభ ఎంపీలు అవినీతిపరులు, 227 మంది బీజేపీ సభ్యులు నేర చరిత్ర కలిగిన వారే’ అని చెప్తున్న ఒక గ్రాఫిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ గ్రాఫిక్‌లో ‘లోక్ సభ ఎంపీల్లో 83% అవినీతిపరులే’ అనే హెడ్‌లైన్ కలిగి ఉన్న ఒక పేపర్ క్లిప్ ఉంది. ఈ పేపర్ క్లిప్ జూమ్ చేసి చూడగా, అందులో అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు రాసి ఉంది. మార్చ్ 28వ తేదీన ఈ ఆర్టికల్ ప్రచురించినట్లు అందులో గమనించవచ్చు. అసలు ఈ పోస్టు చేస్తున్న క్లెయిమ్ లోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం లోక్‌సభ ఎంపీల్లో ఉన్న 83% అవినీతిపరులలో 227 మంది బీజేపీ సభ్యులు.

ఫాక్ట్ (నిజం): మర్చి 2019లో ADR సంస్థ 2014 లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన సిట్టింగ్ ఎంపీల యొక్క నేర, ఆర్థిక, విద్య తదితర విషయాలను విశ్లేషిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో బట్టి 83% లోక్‌సభ ఎంపీలు కోటీశ్వరులని, ఉన్న 521 మంది సిట్టింగ్ ఎంపీల్లో 227 మంది బీజేపీ సభ్యులు కోటీశ్వరులని (నేరస్థులు కాదు), 37 మంది కాంగ్రెస్ వారు కోటీశ్వరులని అలా ఒక్కో పార్టీకి సంబందించినవారిలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు అని వెల్లడించింది. నేర చరిత్ర గురించి వెల్లడిస్తూ 33% మందిపై (174) క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిలో 92 మంది  బిజెపి వారని పేర్కొంది.  కావున పోస్టులో చేస్తున్న క్లయిము తప్పు.

పోస్టులో చెప్తున్న విధంగా  ADR సంస్థ మర్చి 28వ తేదీన, ‘83% లోక్‌సభ ఎంపీలు అవినీతిపరులు, 227 మంది బిజెపి సభ్యులు నేర చరిత్ర కలిగిన వారే’ అని ఏదైనా నివేదికను ప్రచురించిందా అని సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో సెర్చ్ చెయ్యగా, 28 మార్చ్ 2019లో ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలు లభించాయి.

83 శాతం మంది లోక్‌సభ ఎంపీలు ‘కోటీశ్వరులు’, 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్ నివేదిక’ అని ఇండియన్ ఎక్సప్రెస్ వారు ఒక వార్తా కథనంలో రాసారు. ఇదే వార్తను ఎకనామిక్ టైమ్స్ మరియు బిజినెస్ టుడే వారు కూడా ప్రచురించారు. 

ADR సంస్థ 2014 లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన సిట్టింగ్ ఎంపీల యొక్క నేర, ఆర్థిక, విద్య తదితర వాటిని విశ్లేషిస్తూ 28 మర్చి 2019న ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను బట్టి 83 శాతం మంది లోక్‌సభ ఎంపీలు ‘కోటీశ్వరులు’, 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక్కో పార్టీకి సంబంధించిన ఎంపీల్లో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో, ఎంతమంది కోటీశ్వరులో అన్న జాబితాని కూడా అందులో స్పష్ఠంగా పేర్కొన్నారు.

ADR నివేదిక ప్రకారం లోక్‌సభలో ఉన్న అప్పటికి ఉన్న 267 మంది సిట్టింగ్ బిజెపి ఎంపీల్లో 227 మంది  కోటీశ్వరులు ఉన్నారు,  92 మంది సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వైరల్ పోస్టులో 227 మంది బిజెపి ఎంపీలు నేర చరిత్ర కలిగినవారిని తప్పుడు సంఖ్యను రాసారు. అంతే కాక 83 శాతం లోక్‌సభ ఎంపీలు అవినీతిపరులని ఏడీఆర్‌ నివేదికలో పేర్కొన్నట్లు తప్పుగా రాసారు.

227 మంది బిజెపి సభ్యులు కోటీశ్వరులు అని ఈ కింది పట్టికలో చూడచ్చు

చివరిగా, మార్చ్ 2019లో ADR విడుదల చేసిన నివేదికను 28 మర్చి 2023లో వచ్చినదిగా చెప్తూ, తప్పుడు సంఖ్యలతో మరియు క్లైములతో ఈ పోస్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll