Fake News, Telugu
 

2019లో నరేంద్ర మోదీ, అమిత్ షాల ద్వయం మళ్లీ అధికారంలోకి వస్తే పాకిస్థాన్‌ను నాశనం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగంలో అనలేదు

0

అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగానికి సంబంధించిన ఒక  చిన్న క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ వైరల్ క్లిప్‌లో, కేజ్రీవాల్ ‘…మోదీ మరియు అమిత్ షా 2019లో తిరిగి ఎన్నికైతే, పాకిస్తాన్ మనుగడ సాగించదు; వారు పాకిస్థాన్‌ను నాశనం చేస్తారు..’ అని చెప్పడం వినవచ్చు. ఈ కథనం ద్వారా ఈ క్లిప్‌ యొక్క  నిజానిజాలు నిర్ధారిద్దాం.

క్లెయిమ్: 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మోదీ, అమిత్ షాలు పాకిస్థాన్‌ను నాశనం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ఫ్యాక్ట్(నిజం): 2019 లోక్ సభ ఎన్నికల ముందు భాజపాయేతర రాజకీయ పార్టీల నేతలు అందరూ ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ-అమిత్ షాల ద్వయం కనుక 2019లో మళ్ళీ ఎన్నకైతే ఈ దేశం మనుగడ ఉండదని, వారు ఈ దేశాన్ని నాశనం చేస్తారని అన్నారు. వైరల్ వీడియోలో తన ప్రసంగంలోని ఈ భాగంలో భారత దేశం పేరు బదులు పాకిస్థాన్ పేరును ఎడిట్ చేసి తయారు చేశారు. అంచేత పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

వీడియోలో ‘ETV తెలంగాణ’ లోగో మరియు ‘కోల్‌కతా’ పేరును గమనించి ఈ స్పీచ్ యొక్క పూర్తి వీడియో గురించి ఇంటర్నెట్లో వెతకగా, కేజ్రీవాల్ ప్రసంగం కలిగి ఉన్న ఒక యూట్యూబ్ వీడియో దొరికింది. ‘2019 elections are to dethrone Modi, says Kejriwal’ అనే టైటిల్ తో ఉన్న ఈ వీడియో, 2019లో కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో జరిగిన విపక్షాల యునైటెడ్ ఇండియా ర్యాలీలోనిది. ఈ ర్యాలీ 19 జనవరి 2019న నిర్వహించబడింది. దీని గురించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఐతే, తన ప్రసంగంలో కేజ్రీవాల్ పోస్టులోని క్లెయిమ్ మాదిరిగా పాకిస్థాన్ గురించి ఏమైనా అన్నారా అని వీడియోను చూడగా. 5:40 సెకెన్ల దెగ్గరనుండి 6:00 వరకు తన ప్రసంగంలోని భాగం వైరల్ వీడియోతో మ్యాచ్ అవుతుంది. కానీ ఆయన ఈ ఇరవై సెకన్లలో ఎక్కడా కూడా పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురాలేదు.  అసలు వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘ ….నరేంద్ర మోదీ-అమిత్ షాల ద్వయం కనుక 2019లో మళ్ళీ ఎన్నికైతే  ఈ దేశానికి మనుగడ ఉండదు. వారు ఈ దేశాన్ని నాశనం చేస్తారు’ అని అన్నారు. వైరల్ వీడియోలో తన ప్రసంగంలోని ఈ భాగంలో భారత దేశం యొక్క పేరు బదులు పాకిస్థాన్ పేరును ఎడిట్ చేసి తయారు చేసారు.

చివరిగా,  2019లో నరేంద్ర మోదీ, అమిత్ షాల ద్వయం మళ్లీ అధికారంలోకి వస్తే  పాకిస్థాన్‌ను నాశనం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగంలో అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll