ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిందంటూ ‘Way2News’ కథనం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పెంచితే నిరుద్యోగులు ఏమైపోవాలని ఈ పోస్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఫాక్ట్ (నిజం): ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎటువంటి కొత్త ఆర్డినెన్స్ జారీ చేయలేదు. 2023 జనవరి నెలలో ఒక ఫేక్ ఆర్డినెన్స్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడేళ్లు పెంచిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పుడు, ఈ వార్తా పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెకింగ్ వింగ్ ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైన కొత్త ఆర్డినెన్స్ జారీ చేసిందా అని వెతికితే, అటువంటి కొత్త ఉత్తర్వులు ఏవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేయలేదని తెలిసింది.
2022 జనవరి నెలలో వై. యెస్. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) చట్టము, 1984ను సవరిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. 01 జనవరి 2022 నుండి ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులో స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ మరియు వీడియోలని పబ్లిష్ చేశాయి. మళ్ళీ ఈ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్ళకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ఏదీ జారీ చేయలేదు.

2023 జనవరి నెలలో ఒక ఫేక్ ప్రభుత్వ ఆర్డినెన్స్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడేళ్లు పెంచిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పుడు, ఈ వార్తా పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెకింగ్ వింగ్ ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పష్టతను పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.
చివరగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్డినెన్స్ ఏది జారీ చేయలేదు.