అప్డేట్ (18 జూన్ 2024): వ్యాపారవేత్త ముకేష్ అంబానీ రాహుల్ గాంధీని విమర్శించాడని ఇదే సారాంశంతో ఉన్న మరొక పోస్టు ప్రచారంలో ఉంది. అయితే ముకేష్ అంబానీ రాహుల్ గాంధీపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు.
‘రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డ అనిల్ అంబానీ’ అని చెప్తూ, కొన్ని వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబం ఒక విదేశీ ఏజెంట్ అని, దేశ సంపద దొంగలించారని చాలా వ్యాఖ్యలు పోస్ట్ లో ఉన్నాయి. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాహుల్ గాంధీ కుటుంబం ఒక విదేశీ ఏజెంట్ అని, దేశ సంపద దొంగాలించారని చెప్తూ రాహుల్ గాంధీ పై అనిల్ అంబానీ చేసిన వ్యాఖ్యలు.
ఫాక్ట్: అప్పట్లో అనిల్ అంబానీ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రిలయన్స్ గ్రూప్ 2019 లో స్పందించింది. అనిల్ అంబానీ పై రాహుల్ గాంధీ చేస్తున్నవి వక్రీకరించబడిన అబద్ధపు వ్యాఖ్యలని రిలయన్స్ గ్రూప్ ట్వీట్ చేసింది. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వం సమయంలో తమ సంస్థకు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రాజెక్టులు వచ్చాయని, తమ సంస్థ దేశ అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులు పెడుతూ ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించినట్టు గుర్తుచేసారు. అయితే, రాహుల్ గాంధీ కుటుంబం పై పోస్ట్ లోని ఇతర వ్యాఖ్యలు మాత్రం చేయలేదు. రాహుల్ గాంధీ పై అనిల్ అంబానీ పోస్ట్ లోని వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా సమాచారం దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అప్పట్లో అనిల్ అంబానీ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పై రిలయన్స్ గ్రూప్ 2019 లో స్పందించినట్టు తెలిసింది. అనిల్ అంబానీ పై రాహుల్ గాంధీ చేస్తున్నవి వక్రీకరించబడిన అబద్ధపు వ్యాఖ్యలని తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలయన్స్ గ్రూప్ ట్వీట్ చేసింది. ఈ విషయం పై వారు చేసిన ట్వీట్లను ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వం సమయంలో తమ సంస్థకు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రాజెక్టులు వచ్చాయని, తమ సంస్థ దేశ అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులు పెడుతూ ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించినట్టు గుర్తుచేసారు. అయితే, రాహుల్ గాంధీ కుటుంబం పై పోస్ట్ లోని ఇతర వ్యాఖ్యలు మాత్రం చేయలేదు.
రాఫెల్ విషయం పై రాహుల్ గాంధీ కి అనిల్ అంబానీ రాసిన లేఖ తమకు దొరికిందని చెప్తూ, ఒక లేఖ గురించి 2018 లో ‘ఇండియా టుడే’ రిపోర్ట్ చేసింది. అయితే, ఆ లేఖలో కూడా రాహుల్ గాంధీ కుటుంబం ఒక విదేశీ ఏజెంట్ అని, దేశ సంపద దొంగాలించారని అనిల్ అంబానీ వ్యాఖ్యలు చేసినట్టు లేదు. ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ పై పోస్ట్ లోని వ్యాఖ్యలను అనిల్ అంబానీ చేస్తే, అన్నీ ప్రముఖ వార్తాసంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, ఎక్కడా అలాంటి సమాచారం దొరకలేదు.
చివరగా, రాహుల్ గాంధీ కుటుంబం ఒక విదేశీ ఏజెంట్ అంటూ పోస్ట్ లోని వ్యాఖ్యలు అనిల్ అంబానీ చేయలేదు.