Fake News, Telugu
 

‘బండి సంజయ్ ఆస్తులు 600 కోట్లు’ అని ‘వెలుగు’ మరియు ‘ఆంధ్రజ్యోతి’ ఆర్టికల్స్ ప్రచురించలేదు.

0

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎంపీ బండి సంజయ్ ఆస్తుల విలువ 600 కోట్లు అని ‘వెలుగు’ మరియు ‘ఆంధ్రజ్యోతి’ వార్త పత్రికలు ప్రచురించాయని చెప్తూ, రెండు ఫోటోలను సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆస్తుల విలువ 600 కోట్లు అని ‘వెలుగు’ మరియు ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తల ఫోటోలు.

ఫాక్ట్: పోస్ట్ లోని వార్తల ఫోటోలు ఎడిట్ చేయబడినవి. అలాంటి వార్తను ‘V6 వెలుగు’ లేదా ‘ఆంధ్రజ్యోతి’ అసలు ప్రచురించలేదు. ఆ రెండు వార్తల్లోని పదాలు అన్నీ ఒకే మాదిరిగా ఉన్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటోల్లో ఉన్న వార్తా గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అలాంటి వార్తను ‘V6 వెలుగు’ లేదా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఫోటోల్లోని వార్తలను గమనిస్తే, ఆ రెండు వార్తల్లోని పదాలు అన్నీ ఒకే మాదిరిగా ఉన్నట్టు చూడవొచ్చు. రెండు వార్తల్లో సమానమైన లైన్లు ఉన్నట్టు కూడా చూడవొచ్చు. అంతేకాదు, రెండు వార్తలు సరిగ్గా ఒకే పదం దగ్గర ఆగాయి. ఒకే టైటిల్ తో అదే వార్తను రెండు వేరు వేరు వార్తాసంస్థలు సాధారణంగా ప్రచురించవు.

ఒక ఆర్టికల్ వేరే పేజీ లో కొనసాగితే ‘V6 వెలుగు’ వారి ఒరిజినల్ ఆర్టికల్స్ లో ‘మిగితా _ లో’ అని, ‘ఆంధ్రజ్యోతి’ వారి ఒరిజినల్ ఆర్టికల్స్ లో ‘మిగితా _వ పేజీలో’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కానీ, పోస్ట్ లోని ఫోటోల్లో ‘తరువాయి _ పేజీలో’ అని రాసి ఉంది. కాబట్టి, ఈ అధారాలతో పోస్ట్ లోనివి ఎడిట్ చేసిన ఫోటోలని నిర్ధారణకి రావొచ్చు.

ఫోటోల్లోని ఆర్టికల్స్ ని ‘వెలుగు’ మరియు ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించలేదని, అవి ఎడిట్ చేసిన ఫోటోలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వెంకట రమణ ట్వీట్ చేసారు. బీజేపీ తెలంగాణ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా వెంకట రమణ ట్వీట్ ని రీ-ట్వీట్ చేసింది.

2019 లోక్ సభ ఎన్నికల అఫిడవిట్ లో బండి సంజయ్ ప్రకటించిన తన ఆస్తుల వివరాలు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘బండి సంజయ్ ఆస్తులు 600 కోట్లు’ అని ‘వెలుగు’ మరియు ‘ఆంధ్రజ్యోతి’ ఆర్టికల్స్ ప్రచురించలేదు. పోస్ట్ లోని వార్తల ఫోటోలు ఎడిట్ చేయబడినవి.

Share.

About Author

Comments are closed.

scroll