Fake News, Telugu
 

సంబంధం లేని వీడియోని పవన్ కళ్యాణ్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఊరేగింపు దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న జన సమూహం పవన్ కళ్యాణ్ ర్యాలీలో భాగంగా హాజరవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ ఛానెల్ 12 అక్టోబర్ 2022 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వేడుక కోసం భారీగా జనం తరలివచ్చిన దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం 2022 వేడుకలకి సంబంధించి ఒక ఫేస్బుక్ యూసర్ పెట్టిన పోస్టులో, వీడియోలో కనిపిస్తున్న అవే దృశ్యాలతో పోలి ఉన్న కొన్ని ఫోటోలని షేర్ చేసినట్టు తెలిసింది. సోనీ ఎలక్ట్రానిక్ షాప్ ముందు నుండి భారీ జనం ఊరేగింపుగా వెళ్తున్న ఫోటోని ఈ పోస్టులో చూడవచ్చు.

సోనీ ఎలక్ట్రానిక్ షాప్ విజయనగరం పట్టణం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం సమీపంలోని ఫోర్ట్ రోడ్డులోఉన్నట్టు తెలిసింది. విజయనగరం పట్టణాన్ని చూపిస్తూ ఒక యూట్యూబ్ యూసర్ పబ్లిష్ చేసిన వీడియోలో, పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న అదే వీధి దృశ్యాలని చూడవచ్చు.

11 అక్టోబర్ 2022 నాడు విజయనగరంలో జరిగిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వేడుకలకి భారీగా భక్తులు తరలివచ్చినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ సిరిమానోత్సవం వేడుకలలో భాగంగా నిర్వహించిన పురవీధుల ఊరేగింపు వీడియోలని పలు న్యూస్ ఛానెల్స్ పబ్లిష్ చేశాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం దృశ్యాలకి సంబంధించినదని, జనసేన ర్యాలీకి సంబంధించిన వీడియో కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ వీడియోని ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలు భారత్ జోడో యాత్రకు సంబంధించిన దృశ్యాలంటూ కూడా తప్పుగా షేర్ చేశారు.

చివరగా, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వేడుకలకి సంబంధించిన వీడియోని పవన్ కళ్యాణ్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll