13 నవంబర్ 2024న జరిగిన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం సాధించారు (ఇక్కడ). ఈ నేపథ్యంలో, “వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ గెలుపు కోసం కేరళ కాంగ్రెస్ మీడియా ఇంచార్జ్ మహమ్మద్ ముజాహిద్ ఇస్లాం ఆవును కాల్చి చంపాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ గెలుపు కోసం కేరళ కాంగ్రెస్ మీడియా ఇంచార్జ్ మహమ్మద్ ముజాహిద్ ఇస్లాం ఆవును కాల్చి చంపాడు, దానికి సంబంధించిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోకు వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు, ప్రియాంక గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు కంటే ముందే ఈ వీడియో మణిపూర్‌కు సంబంధించింది అంటూ పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఈ వైరల్ వీడియో మణిపూర్‌కి చెందినదా కాదా అనే ఖచ్చితమైన సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ మే 2024లో ప్రచురించబడిన ‘ఫ్రీ ప్రెస్ జర్నల్ (Free Press Journal)” వార్త కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియో మణిపూర్‌కు చెందినది.
ఈ కథనం ప్రకారం, ఈ వీడియో మణిపూర్‌కు చెందినది పేర్కొంటూ పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయగా (ఇక్కడ), వీటిపై PETA (People for the Ethical Treatment of Animals) India (‘PETA’ అనేది అంతర్జాతీయ జంతు హక్కుల రక్షణ సంస్థ) స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్), ఈ వీడియో మరియు ఈ ఘటన ఎక్కడ ఎప్పడు జరిగింది అని నిర్ధారించడానికి మణిపూర్ పోలీసులతో కలిసి పని చేస్తున్నట్లు, అలాగే ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత సంబంధిత జిల్లాలో FIR నమోదు చేయడానికి కృషి చేస్తాము అని పేర్కొంది. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ మే 2024లో ప్రచురించబడిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
ఇదే వీడియో మే 2024లో వైరల్ కాగా, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం Factly, PETA (India)ను సంప్రదించగా, వారు స్పందిస్తూ “మణిపూర్ పోలీసు ప్రధాన కార్యాలయంలోని సైబర్ క్రైమ్ యూనిట్ (CCU) ఈ వీడియోపై సమగ్ర విచారణ జరుపుతోందని, ఈ వీడియోలో మాట్లాడే మాండలికం థాడౌ మాండలికం అని, ఇది Kuki (కూకీ) తెగకు సంబంధించిందని, CCU అధికారులు PETA సంస్థకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. అలాగే, మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో ఈ సంఘటన జరిగి ఉంటుందని X (twitter)లో PETA (India) పోస్టుకు స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్) ఒక యూజర్ పేర్కొన్నగా, ఇదే విషయాన్ని PETA ప్రతినిధులు CCUకి తెలియజేయగా వారు సేనాపతి జిల్లాలో అత్యధిక జనాభా నాగ తెగ ప్రజలని, కావున ఈ సంఘటన సేనాపతి జిల్లాలో జరగడం అసంభవమని CCU అధికారులు చెప్పారని” పేర్కొన్నారు.
ఈ వైరల్ వీడియో మణిపూర్‌కి చెందినదా కాదా అని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము, అయితే ఈ వీడియోకు వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని మేము నిర్ధారించగలము. ఎందుకంటే, 15 అక్టోబర్ 2024న భారత ఎన్నికల సంఘం (ECI) మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున తరుపున ప్రియాంక గాంధీ 23 అక్టోబర్ 2024న నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ ఉప ఎన్నికలు 13 నవంబర్ 2024న జరిగాయి మరియు కౌంటింగ్ 23 నవంబర్ 2024న జరిగింది (ఇక్కడ). ఇకపోతే ఈ వైరల్ వీడియో మే 2024 నుండే సోషల్ మీడియాలో షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ).
అలాగే ఇదే విషయమై ‘India Today’ సంస్థ యొక్క ఫాక్ట్ చెకింగ్ విభాగం వారు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ దీప్తి మేరీ వర్గీస్‌ను సంప్రదించగా, తాను కేరళ కాంగ్రెస్ మీడియా చీఫ్ అని, కేరళ కాంగ్రెస్ మీడియా విభాగంలో మహమ్మద్ అనే వ్యక్తి ఎవరూ లేరని ఆమె తెలిపారు.
చివరగా, వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్త ఆవును చంపాడని పేర్కొంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు