Fake News, Telugu
 

తన మానాడు సభలో నటుడు విజయ్ కేసీఆర్, జగన్‌ను విమర్శిస్తూ ప్రసంగం చేశాడు అని సంబంధంలేని ఒక క్లిప్‌ను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) నేత విజయ్ ఇటీవల తమిళనాడులో మానాడు అనే సభను నిర్వహించాడు. ఈ నేపథ్యంలో విజయ్ తన ప్రసంగంలో, జగన్ మరియు కేసీఆర్ గురించి విమర్శిస్తూ మాట్లాడాడు అని చెప్పి, విజయ్ మానాడు సభలో చేసిన ప్రసంగం యొక్క ఒక చిన్న వీడియో క్లిప్, రెండు పోస్టులు(ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే కాక “నేను గెలవడానికి శవ రాజకీయాలు చెయ్యను, ఏ కత్తుల డ్రామాలు ఆడను,”  అని విజయ్ ఈ సభలో అన్నాడు అని చెప్పి ఒక గ్రాఫిక్ కూడా వైరల్ అవుతోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లను మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  

క్లెయిమ్: మానాడు సభలో నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) నేత విజయ్, జగన్ మరియు కేసీఆర్‌ను విమర్శిస్తూ, వాళ్ల రాజకీయ విధానాలను తన విధానాలతో పోల్చుకుంటూ మాట్లాడాడు.

ఫ్యాక్ట్(నిజం): తన మానాడు ప్రసంగంలో విజయ్, జగన్ మరియు కేసీఆర్‌ల గురించి మాట్లాడలేదు. వైరల్ అవుతున్న క్లిప్ యొక్క తెలుగు అనువాదం- “నాకు తెలిసినంత వరకు మనమంతా ఒక్కటే, మనం అందరం సమానులం. కాబట్టి, నా గుండెల్లో ఉన్న మీ అందరికీ నా ప్రాణ వందనాలు/ ప్రణామాలు.” వైరల్ అవుతున్న క్లిప్‌లో కానీ, మానాడు సభలో తను చేసిన ప్రసంగం మొత్తంలో ఎక్కడా కానీ, విజయ్ జగన్, కేసీఆర్‌ యొక్క రాజకీయ విధానాల గురించి మాట్లాడలేదు. కావున, వైరల్ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, విజయ్, జగన్ మరియు కేసీఆర్‌ను విమర్శిస్తూ, వాళ్ల రాజకీయ విధానాలను తన విధానాలతో పోల్చుకుంటూ మాట్లాడాడు అని చెప్పి వైరల్ అవుతున్న రెండు పోస్టులలో ఉన్న వీడియో క్లిప్ ఒకటే అని మేము గమనించాము. ఆ క్లిప్‌లో విజయ్ తమిళంలో మాట్లాడిన మాటలని తెలుగులోకి Factly అనువదించగా, అసలు తను కేసీఆర్‌ గురించి కానీ, జగన్ గురించి కానీ మాట్లాడనే లేదు అని మాకు స్పష్టంగా అర్థం అయ్యింది. మానాడు సభలో విజయ్ ఇచ్చిన ప్రసంగం యొక్క వీడియోలో 6:48 సెకన్లు దగ్గర తను మాట్లాడిన మాటలని కట్ చేసి వైరల్ క్లిప్‌ని తయారు చేశారు.  

ఈ మాటల యొక్క తెలుగు అనువాదం- “నాకు తెలిసినంత వరకు మనమంతా ఒక్కటే, మనం అందరం సమానులం. కాబట్టి, నా గుండెల్లో ఉన్న మీ అందరికీ నా ప్రాణ వందనాలు/ ప్రణామాలు.” దీన్ని బట్టి విజయ్ తన అభిమానులకి వందనాలు చెప్పుకుంటున్న  క్లిప్‌ని తప్పుగా అనువదించి, తను కేసీఆర్, జగన్ యొక్క రాజకీయ విధానాలని విమర్శిస్తూ, తన రాజకీయ విధానాలతో పోల్చుకుంటూ మాట్లాడాడు అని తప్పుడు క్లెయిమ్స్ చేస్తున్నారు అని స్పష్టం అవుతోంది. 

ఇంతే కాక విజయ్ తన ప్రసంగంలో వీళ్లిద్దర్నీ ఉద్దేశిస్తూ మాట్లాడాడు అని చెప్పడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే యూట్యూబ్ లో ఉన్న తన మానాడు ప్రసంగంలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఎక్కడా కూడా తను ఇలా అననే లేదు. 

అలాగే వైరల్ గ్రాఫిక్‌లో చెప్తున్నట్లు విజయ్- “నేను గెలవడానికి శవ రాజకీయాలు చెయ్యను, ఏ కత్తుల డ్రామాలు ఆడను,” అని కూడా విజయ్ ఈ ప్రసంగం మొత్తంలో ఎక్కడా అనలేదు.

విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి మహా సభలో తను ఈ విధంగా పక్క రాష్ట్రాల నేతల గురించి మాట్లాడితే, దాన్ని మీడియా సంస్థలు కచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేవి. కానీ, ఏ ఒక్క ప్రముఖ వార్తా సంస్థ కూడా విజయ్ ఇలా కేసీఆర్ మరియు జగన్ గురించి మాట్లాడాడు అని రిపోర్ట్ చేయలేదు.

చివరిగా, తన మానాడు సభలో నటుడు విజయ్ కేసీఆర్ మరియు జగన్‌ను విమర్శిస్తూ ప్రసంగం చేశాడు అని తప్పుడు క్లెయిమ్స్ వైరల్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll