Fake News, Telugu
 

భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపిన దృశ్యాలంటూ సంబంధంలేని ఇరాక్‌కు చెందిన 2018 వీడియోను షేర్ చేస్తున్నారు

0

“భారత జెండాను పీకడానికి ప్రయత్నించిన ఉగ్రవాది మీద బాంబు వేసి లేపేసిన ఇండియన్ ఆర్మీ” అని పేర్కొంటున వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఒక వ్యక్తి మూడు రంగులు ఉన్న జెండాను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు సంభవించడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు భారత సైన్యం/భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో ఇరాక్‌కు చెందింది. ఏప్రిల్ 2017లో ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్‌లో ఇరాకీ జెండాను తొలగించడానికి ప్రయత్నిస్తున్న ISIS ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని ఇరాకీ సైన్యం చేసిన వైమానిక దాడిని ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. అలాగే ఇటీవల ఏప్రిల్ 2025లో భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో ‘@reelsdeguerra’ అనే వాటర్‌మార్క్ ఉండటం మనం గమనించవచ్చు. దీని ఆధారంగా మేము ఈ వీడియోను ‘@reelsdeguerra’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 09 ఏప్రిల్ 2025న అప్లోడ్ చేసినట్లు గుర్తించాము. అయితే, ఈ వీడియో వివరణలో ఈ వీడియో ఎప్పడు ఎక్కడ తీశారో పేర్కొనలేదు. కానీ కామెంట్స్ లో పలువురు యూజర్స్ ఈ వీడియో ఇరాక్‌కు చెందినదని పేర్కొన్నారు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగిన అధిక నిడివి గల వీడియోను రిపోర్ట్ చేస్తూ మీడియా సంస్థ ‘అల్ అరబియా (Al Arabiya)’ ఏప్రిల్ 2017లో వారి వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్త కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియో ఏప్రిల్ 2017లో ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్‌లో ఇరాకీ జెండాను తొలగించడానికి ప్రయత్నిస్తున్న ISIS ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని ఇరాకీ సైన్యం చేసిన వైమానిక దాడి దృశ్యాలను చూపిస్తుంది.

ఇదే వీడియోను రిపోర్ట్ చేస్తూ ఇదే విషయాన్ని తెలుపుతూ 2017లో పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వీడియోకు భారత సైన్యం/భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ వీడియో ఇరాక్‌కు చెందింది అని మనం నిర్ధారించవచ్చు. అలాగే ఇటీవల ఏప్రిల్ 2025లో భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.

చివరగా, భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపిన దృశ్యాలంటూ సంబంధంలేని ఇరాక్‌కు చెందిన 2018 వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll