పోలింగ్ బూత్‌లో ఒక వ్యక్తి ఇతరుల వోట్లను కూడా తానే వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తూ, ఇది హైదరాబాద్‌లోని బహదూరపురలో MIM ఓట్లు రిగ్గింగ్ చేస్తున్న వీడియో అంటూ 2024 లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో పోస్టు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: ఓట్ల రిగ్గింగ్ చూపిస్తున్న ఈ వీడియో 2024 లోక్ సభ ఎన్నికల్లో బహదూరపురా, హైదరాబాద్‌లో తీసింది.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2022 లో జరిగిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది. వీడియోలో ఉన్న విజువల్స్ సౌత్ డం డం మున్సిపాలిటీలోని 33వ వార్డు యొక్క 106వ బూత్ నుండి తీసినవి. ఈ వీడియోకు హైదరాబాద్‌లో ఇటీవల ముగిసిన 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధం లేదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియో గురించి తెలుసుకునేందుకు వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇదే వీడియోను 27 ఫిబ్రవరి 2022న TV9 బంగ్లా వారి యూట్యూబ్ చానెల్లో ప్రచురించినట్టు మేము గమనించాం. దీని ప్రకారం, ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ డం డం మున్సిపాలిటీలోని 33వ వార్డులోని ఒక బూత్ లో చోటు చేసుకుంది.
అదే సమయానికి వైరల్ వీడియోను బిజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ వారు తమ బెంగాల్ ‘X’ ప్రొఫైల్లలో షేర్ చేస్తూ ఇది తృణమూల్ కాంగ్రెస్ ఆద్వర్యంలో జరిగినట్టు పోస్టు చేశారు.
దీనిని ఆధారంగా తీసుకొని మరింత వెతికితే, ఈ ఘటన గురించి పలు బంగ్లా వార్తా పత్రికలు ప్రచురించాయి అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ నివేదికల ప్రకారం, 2022లో పశ్చిమ బెంగాల్‌లో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన నేపధ్యంలో సౌత్ డం డం మున్సిపాలిటీలోని 33వ వార్డు యొక్క 106వ బూత్ నంబర్ నుండి సేకరించిన విజువల్స్ ఇవి. దీనికి, హైదరాబాద్ కి గానీ, 2024 లోక్ సభ ఎన్నికలకు గానీ సంబంధం లేదు.
దీని గురించి స్పందిస్తూ, తెలంగాణా ప్రధాన ఎన్నికల అధికారి (Chief Electoral Officer of Telangana) “తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు చెబుతున్న ఓ పాత వీడియో వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో తెలంగాణకు చెందినది కాదు. మరిన్ని వివరాల కోసం, దయచేసి ప్రెస్ నోట్ – CEO తెలంగాణను చూడండి” అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ప్రెస్ నోట్ ద్వారా స్పష్టం చేశారు.
ఇదే వీడియోను ఫాక్ట్ చెక్ చేస్తూ, ఫ్యాక్ట్లీ 2022 లో రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోను, ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.