హిందూ దేవాలయ పూజారిని మతోన్మాద ముస్లింలు కొట్టారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: హిందూ దేవాలయ పూజారిని ముస్లింలు కొట్టే దృశ్యాలను చూపుతున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు నవంబర్ 2020లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా భట్టుకలన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాబికలన్ గ్రామంలోని శ్యామ్ బాబా ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నా కైలాష్ శర్మపై కొందరు యువకులు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన దృశ్యాలను చూపుతుంది. ఈ కేసులో నిందితులుగా అమిత్, కృష్ణ, ప్రదీప్ అనే ముగ్గురు యువకులను పోలీసులు FIR లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటన నిందితుల్లో ఎవరూ ముస్లింలు కారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించి సమాచారం కోసం, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని కొన్ని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ నవంబర్ 2020లో ‘పంజాబ్ కేసరి’ పబ్లిష్ చేసిన వార్త కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, హర్యానా ఫతేహాబాద్‌లోని ధాభి కలాన్ గ్రామంలో చోటుచేసుకుంది, ఓ బాలికతో అసభ్యకరంగా మాట్లాడాడన్న ఆరోపణలతో స్థానిక ఆలయ పూజారిపై కొందరు యువకులు దాడి చేశారని తెలుస్తుంది.
ఈ కథనం ఆధారంగా, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, నవంబర్ 2020లో పబ్లిష్ అయిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా భట్టుకలన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాబికలన్ గ్రామంలోని శ్యామ్ బాబా ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నా 26 ఏళ్ల కైలాష్ శర్మపై కొందరు యువకులు క్రికెట్ బ్యాట్‌తో దారుణంగా దాడి చేశారు, శర్మ అరుపులు విన్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని యువకుల బారి నుంచి రక్షించారు. ఈ వీడియో వైరల్ కాగా పోలీసులు గ్రామానికి వెళ్ళి విచారిస్తున్నట్లు పేర్కొన్నాయి.
‘ఫలానా దిఖానా’ మరియు ‘ది కమ్యూన్’ తమ వార్త కధనాలలో, కేవలం పూజారిని కొట్టాలనే ఉద్దేశ్యంతో కొంతమంది పోకిరి యువకులు ఉద్దేశపూర్వకంగా పూజారి మరియు అతని కాబోయే భార్య మధ్య జరిగిన సంభాషణ ఆడియోను, అతను గ్రామంలోని ఓ బాలికతో అసభ్యకరంగా మాట్లాడాడు అని తప్పుగా ప్రచారం చేశారని తెలిసింది అని పేర్కొన్నాయి.
తదుపరి మేము హర్యానా పోలీస్ వెబ్సైటులో ఈ కేసుకు సంబంధించిన FIR పరిశీలించగా, ఈ కేసులో అమిత్, కృష్ణ, ప్రదీప్ అనే ముగ్గురు యువకులను నిందుతులగా పోలీసులు పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ ఘటనలో ఆలయ పూజారిపై దాడి చేసిన యువకులు ముస్లిం మతానికి చెందినవారు కాదని మనం నిర్థారించవచ్చు.
చివరగా, హర్యానా ఫతేహాబాద్‌లో పూజారిపై కొందరు యువకులు దాడి చేసిన ఒక పాత వీడియో ఇప్పుడు మతపరమైన ఆరోపణలతో తప్పుగా షేర్ చేస్తున్నారు.