లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల (జులై 2024) మణిపూర్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో నిరసనకారులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడం చూడొచ్చు. ఐతే రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనలో ప్రజలు ‘రాహుల్ గాంధీ గో బ్యాక్’ నినాదాలు చేసారు అంటూ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్ పర్యటనలో రాహుల్ గాంధీని నిరసనకారులు అడ్డుకున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ఘటన జనవరి 2024లో అస్సాంలో జరిగిన భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేసినప్పటిది. ఈ వీడియోతో రాహులా గాంధీ ఇటీవల చేసిన మణిపూర్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల 08 జులై 2024న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పునరావాస శిబిరాల్లో ఉన్న మణిపూర్ అల్లర్ల బాధితులను రాహుల్ పరామర్శించారు. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో ఘటన ఈ పర్యటనలో జరిగింది కాదు. ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా జనవరి 2024లో ఈ వీడియోను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.
ఈ కథనాల ప్రకారం వైరల్ వీడియోలోని ఘటన అస్సాంలో జరిగింది. జనవరి 2024లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్బంగ అస్సాంలోని నాగావ్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్ వద్ద ఆగినప్పుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు చేసారు.
‘రాహుల్ గాంధీ గో బ్యాక్’, ‘అన్యాయ్ యాత్ర’ అంటూ నిరసనకారులు నినాదాలు చేసారు. అప్పట్లో ఈ ఘటన అస్సాంలో జరిగిందంటూ రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియోకు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన మణిపూర్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.
చివరగా, అస్సాంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ఇటీవల జరిగిన మణిపూర్ పర్యటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.