Fake News, Telugu
 

పాకిస్తాన్ కరాచీలో ఒక వ్యక్తి విద్యుత్ అధికారిని బెదిరిస్తున్న పాత వీడియోను హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన అంటూ షేర్ చేస్తున్నారు

0

హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు కరెంట్ బిల్లులు కట్టకుండా అధికారులను బెదిరిస్తున్నారు అంటూ ఒక వీడియో  సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు కరెంట్ బిల్లులు కట్టకుండా అధికారులను బెదిరిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): వీడియోలోని ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. షహ్రీ అతౌర్ రెహమాన్‌ అనే వ్యక్తి కరెంట్ దొంగలిస్తూ అధికారులకు దొరికిపోయాడు. ఆ సందర్భంలోనే తన ఇంటికి విద్యుత్తును డిస్‌కనెక్ట్ చేస్తే చంపేస్తానని ఒక అధికారిని బెదిరించాడు. ఈ ఘటనను 2020లో పాకిస్తాన్ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోతో హైదరాబాద్ పాతబస్తీకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్న ముస్లిం వ్యక్తి విద్యుత్ అధికారులను బెదిరిస్తున్న విషయం నిజమే అయినప్పటికీ, ఈ ఘటనకు పాతబస్తీతో ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోను 2020లో రిపోర్ట్ చేసిన పాకిస్తాన్ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం వీడియోలోని వ్యక్తి  కరెంటు దొంగిలించినట్లు ధైర్యంగా ఒప్పుకోవడంతో పాటు అధికారిని బహిరంగంగా బెదిరించాడు.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన ఇతర వార్తా కథనాలు వీడియోలోని వ్యక్తిని కరాచీకి చెందిన షహ్రీ అతౌర్ రెహమాన్‌గా గుర్తించాయి. అతౌర్ రెహ్మాన్‌ విద్యుత్‌ దొంగిలిస్తుండగా కె-ఎలక్ట్రిక్ లిమిటెడ్ అనే పవర్ యుటిలిటీ కంపెనీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అంగీకరించిన అతౌర్ రెహ్మాన్ తన ఇంటికి విద్యుత్తును డిస్‌కనెక్ట్ చేస్తే చంపేస్తానని ఒక అధికారిని బెదిరించినట్లు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

కె-ఎలక్ట్రిక్ లిమిటెడ్ కూడా తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడంటూ ఈ వీడియోను షేర్ చేసింది. వీటన్నిటిబట్టి వీడియోకు పాతబస్తీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.

చివరగా, కరాచీలో ఒక వ్యక్తి విద్యుత్ అధికారిని బెదిరిస్తున్న పాత వీడియోను పాతబస్తీలో జరిగిన ఘటన అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll