2024 అగస్టు- సెప్టెంబర్ నెలల్లో తెలంగాణాలోని పలు జిల్లాల్లో అధిక వర్షపాతం కారణంగా వరదలు సంభవించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి డి. అనసూయ (సీతక్క) మీడియాతో మాట్లాడుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. సహాయక కార్యక్రమాల కోసం తమకి ఒక హెలికాప్టర్ ఇవ్వమని మీడియా ద్వారా ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని చెప్తూ సీతక్క భావోద్వేగానికి గురికావడం ఈ వీడియోలో చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: సెప్టెంబర్ 2024లో తెలంగాణ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వాన్ని హెలికాప్టర్ కోరుతూ భావోద్వేగానికి గురైన మంత్రి డి. అనసూయ (సీతక్క).
ఫాక్ట్: ఈ వీడియో జూలై 2023 నాటిది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నాయి. జూలై 2023లో ములుగు జిల్లాలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాలంటూ ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దీనికి సంబంధించిన పూర్తి వీడియోని జూలై 2023లో అనేక వార్తా సంస్థలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ప్రసారం చేసినట్లుగా గుర్తించాం. ములుగు జిల్లాలో జూలై 2023లో వరదలు సంభవించిన నేపథ్యంలో, సహాయక కార్యక్రామాలు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుతాన్ని హెలికాప్టర్ ఇవ్వమని ప్రతిపక్షంలో ఉన్న ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ప్రభుత్వం ఆ తర్వాత హెలికాప్టర్లు పంపినట్లు ప్రకటించింది. పై ఆధారాలను బట్టి వైరల్ వీడియో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటిదని నిర్ధారించవచ్చు.

ఇక సెప్టెంబర్ 2024 వరదల విషయానికి వస్తే, 03 సెప్టెంబర్ 2024న కేంద్ర హోం శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ వరద సహాయక చర్యల నిమిత్తం రెండు హెలికాప్టర్లను హైదరాబాదులోని హకీంపేట ఎయిర్ బేస్‌లో అందుబాటులో ఉంచగా, అందులో ఒకటి ముఖ్యమంత్రి కోసం కేటాయించారని, మరొకటి ఉపయోగించలేదని పేర్కొన్నారు.

చివరిగా, సెప్టెంబర్ 2024 తెలంగాణ వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వాన్ని హెలికాప్టర్ కోరుతూ మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారంటూ ఒక పాత వీడియోని షేర్ చేస్తున్నారు.