భారత దేశంలోని కార్మికులను, రైతులను, శ్రామికులను వాడుకుంటే దేశాన్ని రక్షించడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవసరమే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భారత దేశంలోని కార్మికులను, రైతులను వాడుకుంటే దేశానికి సైనికులే అవసరం లేదని రాహుల్ గాంధీ చెప్తున్న వీడియో.
ఫాక్ట్: ఇది క్లిప్ చేయబడిన వీడియో. భారతదేశ సైనికులను కార్మికులు, శ్రామికులు, రైతులతో భర్తీ చేయాలని రాహుల్ గాంధీ చెప్పలేదు. భారత సరిహద్దుల్లో చైనా అతిక్రమణలకు భారతదేశం యొక్క ఆర్థిక బలహీనత కారణమని రాహుల్ గాంధీ సూచించారు. కార్మిక, శ్రామిక వర్గానికి సాధికారత కల్పించడం ద్వారా, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా చైనా భారతదేశాన్ని సవాలు చేసే అవకాశం తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దీనికి సంబంధించిన పూర్తి వీడియో లభించింది. ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లలో 24 జనవరి 2021న ప్రసారం చేయబడింది. తమిళనాడులోని చేనేత కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడడం ఈ వీడియో చూపుతుంది.
పూర్తి వీడియోలో, సరిహద్దులో చైనా ఆక్రమణ విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరిని రాహుల్ గాంధీ విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఈ విధంగా అన్నారు, “…ఈ మధ్య చైనా ఆర్మీ భారత భూభాగాన్ని ఆక్రమించడం గురించి మీరు వార్తాపత్రికలలో చదివే ఉంటారు. మన భూభాగంలోకి రావడానికి చైనాకి ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందో అని మనం ఆలోచించాలి. ఈరోజు భారత్ బలహీనంగా ఉందని చైనా చూడగలుగుతుంది. ‘చైనా’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భారత ప్రధానికి ధైర్యం లేదు. కానీ, చైనా భారత భూభాంలోకి ప్రవేశించింది. దీనికి కారణం, భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని చైనాకి అర్థమైంది. మోదీ ప్రభుత్వ విధానాలు కేవలం ఐదు, ఆరు వ్యాపారుల లాభం కోసమే పనిచేస్తున్నాయని, భాతరదేశానికి నిజమైన శక్తి అయిన శ్రామికులు, కార్మికులను నాశనం చేస్తున్నాయని చైనాకి అర్థమైంది. భారత్‌లోని రైతులు, చేనేత కార్మికులు, శ్రామికులకు అవకాశాలు ఉండి బలమైన వారిగా ఉంటే భారత భూభాగంలోకి వచ్చే ధైర్యం చైనా చెయ్యదని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. భారత్‌లోని రైతులు, శ్రామికులు, చిన్న పరిశ్రమలు బలంగా ఉంటే చైనా అధ్యక్షుడు భారత్‌లో తయారైన చొక్కాని వేసుకుంటాడని, చైనా ప్రజలు భారత కార్లు, విమానాలు కొనుక్కొని ప్రయాణిస్తారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. కానీ ఇదంతా ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే భారత ప్రభుత్వం కేవలం ఐదారు వ్యాపారులకు సాయం చేస్తూ భారత్ యొక్క నిజమైన బలాన్ని నాశనం చేస్తుంది. చైనా నుంచి దేశాన్ని రక్షించడానికి భారత ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లని వాడుతుంది. కానీ, ప్రభుత్వం రైతులని, శ్రామికులు, కార్మికులను ఉపయోగించుకుంటే సరిహద్దులో సైనికులు రక్షణ కల్పించాల్సిన అవసరమే లేదు. చైనా భారత్‌లోకి వచ్చే ధైర్యం కూడా చెయ్యదు…”

దీన్ని బట్టి, భారతదేశ రక్షణ దళాలను కార్మికులు, శ్రామికులు, రైతులతో భర్తీ చేయాలని గాంధీ చెప్పలేదని స్పష్టమవుతుంది. భారత సరిహద్దుల్లో చైనా అతిక్రమణలు భారతదేశ ఆర్థిక బలహీనత కారణంగానే జరుగుతున్నాయని రాహుల్ గాంధీ సూచించారు. కార్మిక వర్గాన్ని శక్తివంతం చేయడం ద్వారా, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా చైనా భారత్‌ను సవాలు చేసే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన సూచించారు. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, భారత దేశానికి సైన్యమే అవసరం లేదని రాహుల్ గాంధీ చెప్పారంటూ క్లిప్ చేయబడిన వీడియోని షేర్ చేస్తున్నారు.

