Fake News, Telugu
 

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పూర్తి కాకముందే హరీష్ రావు ఓటమిని అంగీకరించాడంటూ పాత వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఈ రోజు హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ‘హుజురాబాద్‌లో ఓటింగ్ పూర్తి కాకముందే ఓటమిని అంగీకరిస్తూ, టిఆర్ఎస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు మీడియా ముందు హరీష్ రావు ప్రకటించాడంటూ’, దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పూర్తి కాకముందే ఓటమిని అంగీకరిస్తూ, టిఆర్ఎస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు మీడియా ముందు హరీష్ రావు ప్రకటించాడు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో గత సంవత్సరం దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో తెరాస ఓడిపోయిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడినప్పటిది. అన్ని మీడియా సంస్థలు అప్పుడు దీనిని ప్రసారం చేసాయి. వైరల్ వీడియోలో హరీష్ రావు దుబ్బాక అని మాట్లాడిన దానిని తీసేసి, కేవలం తమకు అనుకూలంగా ఉన్నదాన్ని మాత్రమే షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకి హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నికకి ఎటువంటి సంబంధంలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియో గత సంవత్సరం దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడినప్పటిది. ఈ ఎన్నికలో తెరాస పార్టీ ఓడిపోవడంతో, ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, ఆ ఎన్నికలో ఓటమికి నైతిక భాద్యత తానూ తీసుకుంటున్నానని తెలిపాడు. TV5 ప్రసారం చేసిన ఈ వీడియోలో హరీష్ రావు స్పష్టంగా దుబ్బాక గురించి మాట్లాడుతున్నట్టు చూడొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియోలో హరీష్ రావు దుబ్బాక అని మాట్లాడిన దానిని తీసేసి, కేవలం తమకు అనుకూలంగా ఉన్నదాన్ని మాత్రమే షేర్ చేస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.

ఈ విషయాన్ని అప్పట్లో అన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. దీనిని రిపోర్ట్ చేసిన మరికొన్ని కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇదిలా ఉండగా హుజూరాబాద్‌లో ప్రస్తుతం ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతుండగా, ఈ ఎన్నిక ఫలితాలు 02 నవంబర్ 2021న వెలువడతాయి.

చివరగా, హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పూర్తి కాకముందే హరీష్ రావు ఓటమిని అంగీకరించాడంటూ పాత వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll