Fake News, Telugu
 

టర్కీ-సిరియా సరిహద్దులలో తీసిన పాత వీడియోని అఫ్గాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

అఫ్గానిస్తాన్ ప్రజలు తాలిబాన్ ఉగ్రవాదులకు భయపడి కాబుల్ నగరం నుండి పరుగులు తీస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అఫ్గానిస్తాన్ ప్రజలు తాలిబాన్ ఉగ్రవాదులకు భయపడి కాబుల్ నగరం నుండి పారిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): టర్కీ దేశంలో నివసిస్తున్న వందలాది సిరియన్ శరణార్ధులు, ఈద్ పండగ తమ బంధుమిత్రులతో జరుపుకోవడం కోసం హటాయ్  ప్రావిన్స్‌లోని  సిల్వెగాజ్ కస్టమ్స్ గేట్ ద్వారా సిరియా దేశానికి వెళ్తున్న దృశ్యాలివి. ఈ వీడియో అఫ్గానిస్తాన్ దేశానికి సంబంధించింది కాదు. ఈ వీడియో టర్కీ-సిరియా సరిహద్దులలో తీసిన ఒక పాత వీడియో. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని కొంతమంది సోషల్ మీడియా యూసర్లు 2021 జూలై నెలలో తమ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానెల్స్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. టర్కీ దేశంలో నివసిస్తున్న సిరియా శరణార్ధులు, ఈద్ వేడుక తమ బంధువులతో జరుపుకోవడానికి సిరియా దేశానికి వెళ్తున్న దృశ్యాలని వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ వీడియోని ‘Rehanli TV’ న్యూస్ సంస్థ 14 జూలై 2021 నాడు తమ ఫేస్బుక్ పేజిలో షేర్ చేసినట్టు తెలిసింది. సిరియా శరణార్ధులు ఈద్ సెలవుల సందర్భంగా తమ దేశానికి వెళ్తున్న దృశ్యాలని ఈ పోస్టు వివరణలో తెలిపారు.

టర్కీ దేశంలో నివసిస్తున్న వేలాది మంది సిరియన్ శరణార్ధులు, ఈద్ వేడుకు తమ బంధువులతో జరుపుకోవడం కోసం హటాయ్ ప్రావిన్స్‌లోని  సిల్వెగాజ్ కస్టమ్స్ గేట్ ద్వారా సిరియా దేశానికి వెళ్తున్నట్టు ‘Rehanli TV’ 10 జూలై 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో టర్కీ-సిరియా దేశ సరిహద్దులలో తీసినదని స్పష్టమయ్యింది. 

తాలిబాన్ ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్తాన్ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత, వేలాది మంది అఫ్గాన్ ప్రజలు తమ దేశం విడిచి పొరుగుదేశాలైన పాకిస్తాన్, టర్కీ దేశాలకు శరణార్ధులుగా వెళ్ళిన మాట వాస్తవం. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇంకా అఫ్గానిస్తాన్ దేశానికి సంబంధించింది కాదు.

చివరగా, సంబంధం లేని వీడియోని అఫ్గాన్ ప్రజలు తాలిబాన్ ఉగ్రవాదులకు భయపడి కాబుల్ నగరం నుండి పారిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll