మతపరమైన భావాలను అవమానించాడనే పుకార్ల నేపథ్యంలో, 18 డిసెంబర్ 2025న బంగ్లాదెశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో, దీపు చంద్ర దాస్‌ను అనే హిందూ యువకుడుని కొందరు దారుణంగా కొట్టి చంపి, అతని మృతదేహాన్ని ఒక రహదారిపై దహనం చేశారు. అయితే ఇతనిపై చేసిన దైవదూషణ ఆరోపణకు మద్దతు ఇచ్చే ఆధారాలు ఏవీ లభించలేదని ఆ దేశ పోలీసులు, RAB అధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతున్నందున అనేక మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌లో ఉంచారు. ఈ హత్య బంగ్లాదేశ్, ఇంకా విదేశాలలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది, అధికారులు ఈ చర్యను మూక హింసగా ఖండించారు, అలాగే పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఈ సంఘటన తర్వాత, బంగ్లాదేశీ పోలీసులు దీపు చంద్ర దాస్‌ను ‘రాడికల్ తీవ్రవాదుల చేతికి’ అప్పగిస్తున్న దృశ్యాలని చెప్తూ, ఒక వీడియోను (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్ పోలీసులు దీపు చంద్ర దాస్‌ను అతని మరణానికి ముందు ఒక మూకకి అప్పగిస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఇది.
ఫ్యాక్ట్(నిజం): నవంబర్ 2025లో ఒక ఢాకా కళాశాల (Dhaka College) విద్యార్థిని, ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంఘటనకు చెందిన వీడియో ఇది. దీపు చంద్ర దాస్ మరణానికి ముందు, పోలీసులు అతన్ని ఒక మూకకి అప్పగిస్తున్న వీడియో కాదు. దీపు చంద్ర దాస్ సంఘటన కంటే కొన్ని వారాల ముందు నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది. కావున, ఈ పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఇదే క్లిప్ ఉన్న 18 నవంబర్ 2025 నాటి భోరర్ కాగోజ్ అనే బంగ్లాదెశీ మీడియా సంస్థ యొక్క వీడియో రిపోర్ట్ మాకు లభించింది. ఈ వీడియో యొక్క టైటిల్ ‘“What happened to this Dhaka College student?” దీన్ని బట్టి, ఇది 18 డిసెంబర్ 2025న, మైమెన్‌సింగ్‌లో జరిగిన దీపు చంద్ర దాస్ మూకదాడికి సంబంధించినది కాదని మనకు స్పష్టం అవుతుంది.

దీనితో పాటు, ఇదే సంఘటనను వేరే యాంగిల్‌లో తీసిన మరో వీడియో మాకు @dhakatoday_news అనే యూట్యూబ్ ఛానల్‌లో లభించింది. ఈ వీడియో టైటిల్ ‘‘College student starts crying after being beaten up by police.” ఈ వీడియోలో, వైరల్ వీడియోలో లేని కొన్ని అదనపు విజువల్స్ ఉన్నాయి, ఇందులో మనం ఒక పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తిని వదిలేయడం చూడవచ్చు.
ఈ రెండు వీడియోలలో, పోలీసులు పట్టుకెళ్తున్న వ్యక్తి ‘Momin’ అనే పేరు ఉన్న జెర్సీ (టీ-షర్ట్) వేసుకొని ఉండడం మనం గమనించవచ్చు. అతను వేసుకున్న టీ-షర్ట్ పైన ‘Dhaka College’ యొక్క లోగో ఉంది. ఇదే టీ-షర్ట్ పైన ఒక పక్కన ఏమో ‘సెషన్ 2022-23’ అని రాసి ఉంది. ఇతని టీ-షర్ట్ పైన ఉన్న లోగోను Dhaka College యొక్క అధికారిక లోగోతో పోల్చి చూడగా, అవి రెండు ఒకే లాగా ఉన్నాయని మాకు తెలిసింది. ఈ రెండిటి మధ్య ఉన్న పోలికను మీరు ఈ క్రింది ఫొటోలో చూడవచ్చు.
అదనంగా, ఈ వీడియోను దీపు చంద్ర దాస్ మరణానికి ముందుది అని చెప్పి సోషల్ మీడియాలో తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారని, బంగ్లాదేశీ ఫ్యాక్ట్-చెకర్ ‘షోహనూర్ రెహ్మాన్’ ‘X’ ద్వారా చెప్పాడు.
చివరగా, ‘ఢాకా కాలేజీ’ విద్యార్థికి సంబంధించిన ఒక పాత, సంబంధం లేని వీడియోను బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యకు తప్పుగా ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

