Fake News, Telugu
 

సంబంధంలేని ఫోటోను హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా తరువాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తున్నప్పటిది అని షేర్ చేస్తున్నారు

0

హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా తరువాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, కొద్దిపాటి సామానుతో ఒక చిన్న వసతికి బయలుదేరాడు అని క్లెయిమ్ చేస్తూ ఒక వ్యక్తి తన సంచులను పట్టకుని ఉన్న ఫోటోను (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) మనోహర్ లాల్ ఖట్టర్ ది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: రాజీనామా తరువాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి వెళుతున్న ఫోటో. 

ఫాక్ట్ (FACT): ఫోటోలో ఉన్నది మనోహర్ లాల్ ఖట్టర్ కాదు. ఈ ఫోటో 2019 నుండే ఇంటర్నెట్ లో ఉంది, కానీ మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా 12 మార్చ్ 2024న రాజీనామా చేసారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో సోషల్ మీడియాలో 2019 నుండే ప్రచారం  అవుతూ కనిపించింది (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఇదే ఫోటోను 2020 వ్యవసాయ చట్టాలకు ముడి పెడుతూ పోస్ట్ చేసారు. 

12 మార్చ్ 2024లో మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసారు (ఇక్కడ మరియు ఇక్కడ), అయితే పైన లభించిన సమాచారం ప్రకారం వైరల్ ఫోటో 2019 నుండే ప్రచారం అవుతోంది. కావున, ఈ వైరల్ ఫోటో మోహన్‌లాల్ ఖట్టర్ రాజీనామా చేయకముందే తీయబడింది అని అర్ధం అవుతుంది. 

అంతేకాక, మనోహర్ లాల్ ఖట్టర్ కి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ, ఇతర  ఏ వార్తా కథనాల్లో కూడా ఆయన తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, తనకు సంబంధించిన కొద్దిపాటి సామానుతో వెళ్తున్నప్పుడు తీసిన ఫోటో అని దీన్ని షేర్ చేయలేదు.

మనోహర్ లాల్ ఖట్టర్ ఫోటోలను వైరల్ ఫొటోలో ఉన్న వ్యక్తితో పోల్చితే అసలు అందులో ఉన్నది ఖట్టరేనా అనే సందేహం వస్తుంది. వైరల్ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు, ఆ ఫోటోని ఏ సందర్భంలో తీశారు అన్నది కచ్చితంగా తెలియనప్పటికీ ఈ ఫోటోకి మనోహర్ లాల్ ఖట్టర్ కి ఏ సంబంధం లేదని చెప్పవచ్చు.

చివరగా, సంబంధంలేని వ్యక్తి ఫోటోను మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తున్నప్పటిది అని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll