ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేరళ రాష్ట్రంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. బీజేపీ జెండా ఆకారంలో నిలుచున్న మానవ సమూహం యొక్క ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ కేరళలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనాల ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది. 2015 లో బీజేపీ పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా గుజరాత్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో, బీజేపీ కార్యకర్తలు ఇలా బీజేపీ జెండా రూపంలో మానవ సమూహంగా నిలిచున్నారు. ఈ ఫోటో యోగి ఆదిత్యనాథ్ ఇటివల కేరళలో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ The Indian Express న్యూస్ సంస్థ 2015 లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటో యొక్క వివరణలో, ‘More than 25,000 people form BJP flag as Chief Minister Anandiben Patel reads out the party’s “Panch Nishtha pledge” on its 35th foundation day, in Dahod on Monday. (Source: Express Photo by Bhupendra Rana)’, అని తెలిపారు. దీనిబట్టి, ఈ ఫోటో 2015లో గుజరాత్ లో జరిగిన బీజేపీ పార్టీ 35వ స్థాపక దినోత్సవ సభకు సంబంధించిందని తెలిసింది.
2015లో గుజరాత్ లో జరిగిన ఈ బహిరంగ సభ వీడియోని ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, ఈ ఫోటోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 06 ఏప్రిల్ 2015 నాడు తన ట్విట్ లో షేర్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో 2015లో జరిగిన బహిరంగ సభకు సంబంధించింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 21 జూలై 2021 నాడు కేరళలో నిర్వహించిన విజయ యాత్ర సభకు సంబంధించిన ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, గుజరాత్ లో జరిగిన పాత బహిరంగ సభ ఫోటోని యోగి ఆదిత్యనాథ్ ఇటివల కేరళలో నిర్వహించిన బహిరంగ సభ ఫోటోగా షేర్ చేస్తున్నారు.