Fake News, Telugu
 

ధర్మస్థలలో దొరికిన అస్థిపంజరాలు అంటూ ఫ్రాన్స్‌కు చెందిన పాత ఫోటోని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కర్ణాటకలోని ధర్మస్థల పట్టణంలో 1995-2014 మధ్య కాలంలో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి 03 జూలై 2025న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో ధర్మస్థల దేవాలయంలో తాను పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నానని, ప్రాణ భయంతో కొందరు వ్యక్తుల బలవంతంతో ఈ పని చేశానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు మీడియా వెల్లడించింది. అలాగే, మరో వ్యక్తి కూడా ఒక మహిళని పూడ్చి పెడుతున్నప్పుడు తాను చూశానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ బృందం విశ్రాంత ఉద్యోగి చెప్పిన ప్రదేశాల్లో అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో 29 జూలై 2024 నుంచి తవ్వకాలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో, ధర్మస్థల తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలను చూపుతున్నట్లుగా ఉన్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

May be an image of bone and text that says "ఈ అస్థిపంజరాలలో కనీసం ఒక్క ఆవుదైనా వుంటే బాగుండు, అంతా రోడ్ల మీదకు వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ అన్నీ మనుషులవే ఉన్నాయి. #ధర్మస్థల"
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ధర్మస్థల సామూహిక హత్యల కేసుకి సంబంధించి జూలై 2025 నుంచి జరిగిపిన తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలను చూపుతున్న ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో ఫ్రాన్స్‌లోని రెన్నెస్ పట్టణంలో జకోబిన్స్ కన్వెంట్ ప్రాంతంలో 2011-13 మధ్య కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ 15వ శతాబ్దపు సైనికుల అస్థిపంజరాలకు సంబంధించినది. ధర్మస్థల తవ్వకాల్లో కొన్ని మనిషి ఎముకలు, పుర్రె దొరికాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ, సిట్ అధికారికంగా వీటిని ధృవీకరించలేదు. శాస్త్రీయ పరీక్షల తర్వాతే పూర్తి నివేదిక ఇస్తామని వెల్లడించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో కనీసం 2021 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం. మీడియా కథనాల (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, వైరల్ ఫోటో ఫ్రాన్స్ లోని Inrap అనే పురావస్తు పరిశోధన సంస్థ 2011-13 మధ్య కాలంలో ఫ్రాన్స్ లోని రెన్నెస్ పట్టణంలో జకోబిన్స్ కన్వెంట్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ వందల సంఖ్యలలో ఉన్న అస్థిపంజరాలను చూపుతుంది. ఈ ఫోటోని రోజన్ కొల్లేటర్ అనే పురావస్తు శాస్త్రవేత్త తీసినట్లు Inrap కథనంలో పేర్కొంది.

వైరల్ ఫోటోని అసలు ఫోటోతో పోల్చగా, అసలు ఫోటోని క్రాప్ & ఫ్లిప్ చేసి వైరల్ ఫొటోగా షేర్ చేస్తున్నట్లుగా గుర్తించాం. ఈ అస్థిపంజరాలు 1491లో రెన్నెస్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో చనిపోయిన ఫ్రెంచ్ రాయల్ ఆర్మీ సైనికులవని Inrap గుర్తించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

A collage of bones and bones  AI-generated content may be incorrect.

ఇక ధర్మస్థలలో 29 జూన్ 2025న ప్రారంభమైన తవ్వకాలు ఈ ఆర్టికల్ ప్రచురించే సమయానికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ తవ్వకాల్లో మనుషుల ఎముకలు, పుర్రె దొరికాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ, ప్రత్యేక విచారణ బృందం అధికారికంగా ఏ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. శాస్త్రీయ పరీక్షల తర్వాతే పూర్తి నివేదిక ఇస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

A close up of a newspaper  AI-generated content may be incorrect.

చివరిగా, ధర్మస్థలలో దొరికిన అస్థిపంజరాలు అంటూ ఫ్రాన్స్‌కు చెందిన పాత ఫోటోని తప్పుగా షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll