Fake News, Telugu
 

2021 నాటి ఒక పాత, సంబంధం లేని వీడియోను, ఇటీవల పాకిస్తానీలు డబ్బు తీసుకోవడానికి బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్న దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

22 ఏప్రిల్ 2025న  పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు ప్రాణాలు కోల్పోయిన తరువాత, భారత సాయుధ దళాలు 07 మే 2025 తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంతటా తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ జరిగిందని భారత ప్రభుత్వం పేర్కొంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎటువంటి దాడి జరగలేదని నొక్కి చెప్పింది. ఈ దాడులను కేంద్రీకృత, నాన్-ఎస్కలేటరీగా ప్రభుత్వం పేర్కొంది. సైనిక వర్గాలను ఉటంకిస్తూ, మీడియా నివేదికలు ఆపరేషన్ సమయంలో కనీసం 80 మంది ఉగ్రవాదులు మరణించారని సూచించాయి. అయితే, క్షిపణి దాడుల్లో కనీసం 26 మంది పౌరులు మరణించారని, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ దళాలు చేసిన సరిహద్దు కాల్పుల్లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించారని, జమ్మూ కాశ్మీర్‌లో 38 మంది గాయపడ్డారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, పాకిస్తానీయులు తమ బ్యాంకుల వద్ద డబ్బు తీసుకోవడానికి క్యూలో నిలబడి ఉన్నారని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. ‘పాకిస్తాన్ బ్యాంకుల్లో గందరగోళం! నగదును బ్యాంకులనుంచి ఉపసంహరించుకోవడానికి ప్రజలు పరుగెత్తుతున్నారు..,’ అని చెప్తూ ఈ వీడియోని యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, వివిధ బ్యాంకులు మరియు ATMల ముందు ప్రజలు నిలబడి ఉన్న క్లిప్‌లను మనం చూడవచ్చు. ABP లైవ్ కూడా ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లను వారి YouTubeలో ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసింది. పాకిస్తాన్‌లోని బ్యాంకుల బయట డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి పాకిస్తానీలు క్యూలో నిలబడి ఉన్నారని, ఇది భారతదేశం వారిపై దాడి చేస్తుందనే భయం యొక్క ప్రభావం అని వారు ఈ వీడియో యొక్క టైటిల్లో పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ చేసిన వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు డబ్బు తీసుకోవడానికి బ్యాంకుల ముందు క్యూలో నిలబడి ఉన్నట్లు చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఆగస్ట్ 2021లో ఆఫ్ఘన్ పౌరులు డబ్బు తీసుకోవడానికి ఆఫ్ఘానిస్తాన్‌లోని కాబుల్‌లో బ్యాంకుల ముందు వరుసలో నుంచున్న దృశ్యాలను చూపిస్తున్న ఒక వీడియో నుండి కొన్ని విజువల్స్‌ను ఉపయోగించి ఎడిట్ చేసిన వీడియో ఇది. ఈ వీడియో పాకిస్తాన్‌లో తీసింది అనిపించేలా దానికి పాకిస్తానీ సైన్‌బోర్డులు ఉన్న రెండు క్లిప్‌లను జోడించారు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తనిఖీ చేయడానికి, మేము వైరల్ వీడియో నుండి కొన్ని కీఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా మాకు ఆగస్టు 2021లో YouTubeలో ‘TRT వరల్డ్’ పోస్ట్ చేసిన ఒక వీడియో రిపోర్ట్ దొరికింది. ఇందులో వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలు ఉన్నాయి.

వీడియో యొక్క టైటిల్, వివరణ ప్రకారం, తాలిబాన్లు ఆంక్షలు విధించవచ్చనే భయంతో కాబూల్‌లోని ఆఫ్ఘన్లు డబ్బును విత్‌డ్రా చేయడానికి బ్యాంకుల బయట క్యూ కట్టిన దృశ్యాలను ఇది చూపిస్తుంది. వీడియో వివరణలో ‘తాలిబాన్ బ్యాంకులను తిరిగి తెరవాలని ఆదేశించింది, కానీ నగదు ఉపసంహరణలపై వారానికి $200 పరిమితిని విధించింది‘ అని కూడా పేర్కొని ఉంది.

వైరల్ వీడియోలో ఈ వీడియోలోని కొన్ని క్లిప్‌లు, పాకిస్తాన్ బ్యాంకుల సైన్ బోర్డుల యొక్క రెండు అదనపు షాట్‌లు ఉన్నాయి (ఒక బోర్డు పాక్షికంగా కనిపిస్తుంది, మరొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్‌ను చూపిస్తుంది), ఒకటి 4 సెకన్ల దగ్గర మరియు మరొకటి 17 సెకన్ల దగ్గర ఉన్నాయి. అంటే 2021లో ఆఫ్ఘన్లు తమ బ్యాంకుల వద్ద నగదు విత్‌డ్రా చేసుకుంటున్న వీడియోను పాకిస్తాన్ బ్యాంకుల రెండు షాట్‌లతో ఎడిట్ చేసి, దీనిని పాకిస్తాన్‌లో ఇటీవలి తీసిన దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో 2021 నాటిదని, ఇటీవలి జరుగుతున్న సంఘటనలకు సంబంధం లేదని ఇది స్పష్టం చేస్తుంది.

ఈ వీడియోలో చూపిస్తున్న సంఘటన గురించి మరింత తెలుసుకోవడానికి, మేము ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ చేయగా, ఆగస్టు 2021లో దీనిపై వచ్చిన వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి తన దళాలను ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.

వార్తా కథనాల ప్రకారం, తాలిబన్ల అధికారం పొందాక ఆఫ్ఘానిస్తాన్‌లో దోపిడీకి దారితీస్తుందనే భయంతో బ్యాంకులు మూసివేయబడ్డాయి (ఇక్కడ, ఇక్కడ). అయితే, వాటిని తరువాత తెరిచారు, దీని వలన ప్రజలు నగదును విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్దకు పరుగెత్తారు. 

అదనంగా, ఇటీవల పాకిస్తాన్ పౌరులు డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుల ముందు క్యూలో నిలబడిన సంఘటనలు జరిగినట్లు ఏవైనా విశ్వసనీయ వార్తా కథనాలు ఉన్నాయా అని తనిఖీ చేయడానికి మేము ఇంటర్నెట్లో ఒక కీవర్డ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథానాలు దొరకలేదు.

చివరగా, 2021 నాటి ఒక పాత, సంబంధం లేని వీడియోను, ఇటీవల పాకిస్తాన్ ప్రజలు డబ్బు తీసుకోవడానికి బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్న దృశ్యాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll