Fake News, Telugu
 

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక వృద్ధుడిపై ఆవులు దాడి చేసి చంపిన సంఘటనను తిరుపతిలో జరిగినట్లుగా షేర్ చేస్తున్నారు

0

తిరుపతిలో ఒక వ్యక్తిపై ఆవులు దాడి చేస్తున్న దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరుపతిలో ఒక వ్యక్తిపై ఆవులు దాడి చేస్తున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో తిరుపతికి సంబంధించినది కాదు. ఈ వీడియో 23 జూన్ 2025న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని కల్వాన్ పట్టణంలో భాలచంద్ర రఘునాథ్ మల్పురే అనే వృద్ధుడిపై ఆవులు దాడి చేసి చంపిన సంఘటనను చూపిస్తుంది. వార్తా కథనాల ప్రకారం, ఆవుల దాడిలో మరొక వ్యక్తి  కూడా గాయపడ్డాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ, 24 జూన్ 2025న, మరాఠీ మీడియా సంస్థ ‘లోక్‌సత్తా’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పబ్లిష్ చేసిన కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని కల్వాన్ పట్టణంలో 85 ఏళ్ల వృద్ధుడిని ఆవులు దాడి చేసి చంపిన సంఘటనను చూపిస్తుంది.

దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ ఘటన 23 జూన్ 2025న నాసిక్ జిల్లాలోని కల్వాన్ పట్టణంలోని ఓల్డ్ ఓటూర్ రోడ్డులో కల్వాన్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ ముందు జరిగింది. కల్వాన్‌లోని ఛత్రపతి శివాజీ నగర్ నివాసి అయిన భాలచంద్ర రఘునాథ్ మల్పురే (85) ద్విచక్ర వాహనంపై నుండి దిగగానే, అకస్మాత్తుగా రెండు కోపోద్రిక్తులైన ఆవులు అతనిపై దాడి చేసి నేలపై పడేసి, కొమ్ములతో పొడుస్తూ, కాళ్లతో తన్నాయి. సమీపంలో ఉన్న ప్రజలు కర్రలు, రాళ్లతో ఆవులను తరిమికొట్టడానికి ప్రయత్నించారు, కానీ ఆవులు అతనిపై దాడి చేస్తూనే ఉన్నాయి.  చివరకు అంతా కలిసి ఎలాగోలా వృద్ధుడిని పక్కకు లాక్కెళ్లారు. అయినా ఆ ఆవులు అతన్ని వదలకుండా వారిపైకి దూసుకెళ్లి మరీ దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై కూడా దాడి చేశాయి. చివరకు అంతా కలిసి పెద్ద పెద్ద కర్రలతో వాటిని వెంటబడి దూరంగా తరిమికొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మల్పురేను చికిత్స నిమిత్తం సమీపంలోని కల్వాన్ గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ దాడిలో మల్పురేను రక్షించడానికి ప్రయత్నించిన అబా మోర్ అనే వ్యక్తి కూడా గాయపడ్డాడని కథనాలు పేర్కొన్నాయి.

చివరగా, నాసిక్ జిల్లాలోని కల్వాన్ పట్టణంలో ఒక వృద్ధుడిపై ఆవులు దాడి చేసి చంపిన సంఘటనను తిరుపతిలో జరిగినట్లుగా షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll