ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. 09 డిసెంబర్ 2024న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, అదే రోజు తెలంగాణ సచివాలయంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పదిహేడు అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో, సంవత్సర పాలనలో విజయవంతంగా ప్రజల్ని మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామ్ చందర్ నాయక్ అభినందిస్తున్నట్లు చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వైరల్ వీడియోలో, ఎమ్మెల్యే సభలో మాట్లాడుతూ “మనం ప్రజల్ని మోసం చేసే దాంట్లో విజయవంతం అయినం అధ్యక్షా. ఈ రోజు ప్రజల్లో చాల స్ఫూర్తిదాయకంగా ముందుకి తీసుకెళ్తున్నాం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేయాలి అధ్యక్షా” అని అనడం మనం చూడవచ్చు. “నిజం నిర్భయంగా ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ మాట్లాడుతూ ఒక ఏడాది పాలనలో ప్రజలను విజయవంతంగా మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్లు చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. 09 డిసెంబర్ 2024న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు చర్చలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి యూట్యూబ్‌లో ‘తెలంగాణ సీఎంఓ (Telangana CMO)’ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 09 డిసెంబర్ 2024న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు చర్చ యొక్క లైవ్ స్ట్రీమ్ ఫుటేజీని పరిశీలించాము (ఇక్కడ). 09 డిసెంబర్ 2024న జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు చర్చను పలు మీడియా సంస్థలు కూడా లైవ్ టెలికాస్ట్ చేశాయి (ఇక్కడ & ఇక్కడ).

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, 09 డిసెంబర్ 2024న అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు అని తెలుస్తుంది. ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ ప్రసంగంలోని నాలుగు వేర్వేరు భాగాలను తీసుకుని వాటిని జోడించి వైరల్ వీడియో క్లిప్పింగ్ రూపొందించారు.
యూట్యూబ్ వీడియోలో టైంస్టాంప్ 1:24:40 నిమిషాల నుండి ‘గత ఒక సంవత్సరంలో మనం’ అనే క్లిప్ తీసుకోబడింది, టైంస్టాంప్ 1:24.42 నుండి ‘విజయవంతం అయినం అధ్యక్షా’ అనే క్లిప్ తీసుకోబడింది, టైంస్టాంప్ 1:24:45 నుండి ‘ప్రజల్ని మోసం చేసే దాంట్లో’ అనే తీసుకోబడింది, టైంస్టాంప్ 1:24:21 నుండి ‘ముఖ్యంగా ముఖ్య మంత్రి గారికి అభినందనలు తెలియజేయాలి’ అనే క్లిప్ తీసుకోబడింది.
వాస్తవంగా టైంస్టాంప్ 1:24:21 వద్ద ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ మాట్లాడుతూ,“తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా, ఒక రాష్ట్రీయ గీతాన్ని, మరి ఈ రోజు ప్రజల్లో చాల స్ఫూర్తిదాయకంగా ముందుకి తీసుకెళ్తున్నాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలియజేయాలి అధ్యక్షా, అదే విధంగా కేవలం, మరి పోరాట స్ఫూర్తి ని తెలంగాణ ప్రజలలో నింపడమే కాదు, ప్రజాకాంక్షలు నెరవేర్చే విధంగా పాలనను కూడా, మరి గత ఒక సంవత్సరంలో మనం ప్రజలకు అన్ని ఫలాలను అందించడంలో కూడా విజయవంతం అయ్యాం అధ్యక్షా, మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కెసిఆర్ కుటంబ సభ్యులు ప్రతిదాన్ని వక్రీకరిస్తుంటే, దాన్ని కూడా మనం స్వాగతిస్తే అది కరెక్ట్ కాదు” అని అన్నారు.
చివరగా, కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలను విజయవంతంగా మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ అసెంబ్లీలో అభినందిచినట్లుగా ఒక ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు.