లెబనాన్ దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ ఇటీవల చేసిన దాడుల నేపథ్యంలో, పేజర్లు, వాకిటాకీల (ఇక్కడ మరియు ఇక్కడ) తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ గొర్రెలను పేల్చి హిజ్బుల్లాను టార్గెట్ చేస్తుంది అని క్లెయిమ్ చేస్తూ, ప్రముఖ మీడియా సంస్థ CNN వారి ఒక వీడియో రిపోర్టుని (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: పేజర్, వాకీటాకీ తర్వాత ఇప్పుడు లెబనాన్‌లో గొర్రెలను పేల్చి హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దేశం దాడి చేసింది అని చెప్తున్న CNN వారి వార్తా కథనం.
ఫ్యాక్ట్(నిజం): ఇది వ్యంగ్యం కోసం చేసిన ఒక ఎడిటెడ్ వీడియో. దీన్ని డానీ పొలిష్‌చుక్ అనే ఒక కమెడియన్ AI ఉపయోగించి తయారు చేశాడు. అలాగే ఇజ్రాయెల్ దేశం, లెబనాన్‌లో గొర్రెలను పేల్చి హిజ్బుల్లా గ్రూప్‌పై దాడి చేసింది అని ఎటువంటి వార్తా కథనాలు లేవు. కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌ని వెరిఫై చేయడానికి ఇంటర్నెట్లో తగిన కీ వార్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేస్తే లెబనాన్‌లో గొర్రెలను పేల్చి హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దేశం దాడి చేసింది అనే క్లెయిమ్‌కి రుజువుగా మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అలాగే CNN దీని మీద ఎటువంటి వీడియో రిపోర్ట్ ప్రచురించలేదు అని కూడా మాకు తెలిసింది.
వైరల్ అవుతున్న వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ చేసి చూడగా ఈ వీడియోని ముందుగా డానీ పొలిష్‌చుక్ అనే ఒక కమెడియన్ ‘X’లో అప్లోడ్ చేశాడు అని మాకు తెలిసింది.
డానీ పొలిష్‌చుక్, CNN యొక్క యాంకర్ జెక్ టాపర్ ఈ వార్తను రిపోర్ట్ చేస్తున్నట్టుగా, ఈ వీడియోని తను AI ఉపయోగించి తయారు చేశాడని ఒక ట్వీట్ ద్వారా చెప్పాడు. యే AI యాప్ ఉపయోగించి చేశాడని తనని ఒక యూజర్ అడుగగా, Eleven Labs మరియు Hedra AI ఉపయోగించి చేశాడు అని డానీ చెప్పాడు. డానీ పొలిష్‌చుక్ తన సోషల్ మీడియాలో కొన్ని పొలిటికల్ సెటైర్/కామెడీ వీడియోలను అప్లోడ్ చేశాడు (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియో కూడా వ్యంగ్యం కోసం చేసింది.
తన వీడియో వైరల్ అయిన తర్వాత CNN వారు ఈ విషయంపై ఒక వివరణ ఇచ్చారు అని చెప్తూ ఇంకో AI వీడియోని ‘X’లో పోస్ట్ చేశాడు.
చివరిగా, వైరల్ అవుతున్న ఈ CNN వీడియో రిపోర్ట్, AI ఉపయోగించి వ్యంగ్యం కోసం తయారు చేసిన వీడియో.