సోషల్ మీడియా నిషేధంతో నేపాల్‌లో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కనీసం 51 మంది మరణించారు. ఆందోళనకారులు ప్రముఖ ప్రభుత్వ భవనాలను, రాజకీయనాయకుల ఇళ్లపై దాడి చేసి నిప్పంటించారు. సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగే సరికి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ 9 సెప్టెంబర్ 2025న తన పదవికి రాజీనామా చేశారు. 12 సెప్టెంబర్ 2025న నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో, నేపాల్‌ను భారత్‌లో కలపాలని నేపాలీలు భారత జాతీయ జెండాలను పట్టుకొని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలోని వ్యక్తులు “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” నినాదాలను చేయడం కూడా చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: సెప్టెంబర్ 2025లో నేపాల్‌ను భారత్‌లో కలపాలని నేపాలీలు భారత జాతీయ జెండాలతో నిరసన చేస్తున్నప్పటి దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియో నేపాల్‌కు సంబంధించినది కాదు. ఈ వీడియో సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌లో 12 ఆగష్టు 2025న నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీకి సంబంధించినది. ఇందులో సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపుతున్న ఆగష్టు 2025 నాటి పలు వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ వీడియో 79వ భారత స్వాతంత్ర వేడుకల సందర్భంగా సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌లో 12 ఆగష్టు 2025న నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీకి సంబంధించినవి. ఈ ర్యాలీలో సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్, మంత్రులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అలాగే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ 12 ఆగష్టు 2025న తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. వైరల్ వీడియోల్లో ఉన్నట్లుగానే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, సీఎం ప్రేమ్ సింగ్ వస్త్రధారణ ఇందులో కూడా ఉండడం చూడవచ్చు.

వైరల్ వీడియో, మీడియా కథనాలు, ప్రేమ్ సింగ్ సోషల్ మీడియా పోస్టుల్లోని దృశ్యాలను పోల్చగా ఇవన్నీ 12 ఆగష్టు 2025న సిక్కిం సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌లో జరిగిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీకి సంబంధించినవిగా నిర్ధారించవచ్చు.

చివరిగా, నేపాల్‌ను భారత్‌లో కలపాలని నేపాలీలు డిమాండ్ చేస్తున్నారంటూ సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు.