‘నైలు నదికి సమీపంలోని ఉష్ణమండల సరస్సులో ఉన్న జల శాస్త్రవేత్తలు మానవ ముఖానికి దగ్గరగా ఉన్న చేపలను చూసి ఆశ్చర్యపోయారు….. నమ్మశక్యం కాదు!.. ‘ అని చెప్తూ మనిషి మొహం గల చేప దృశ్యాలు ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క ప్రామాణికతను వెరిఫై చేద్దాం.
క్లెయిమ్: నైలు నదికి సమీపంలో ఉష్ణమండల సరస్సులో మానవ ముఖం గల చేప కనుగొనబడింది.
ఫ్యాక్ట్ (నిజం): వైరల్ వీడియోలోని విజువల్స్ AI ద్వారా రూపొందించినవి. నైలు నదికి సమీపంలో మానవ ముఖం ఉన్న చేపని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ యొక్క వాస్తవికతను వెరిఫై చేయడానికి మొదటగా మేము ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ శోధనను చేసాము. ఇది ‘హెడ్‌ట్యాప్ వీడియోస్’ అనే ఛానల్లో అప్‌లోడ్ చేయబడిన ఒక YouTube వీడియోకు దారితీసింది. వైరల్ క్లెయిముతో పాటు షేర్ చేస్తున్న వీడియో ఇదే.
‘ది హ్యూమన్ ఫేస్డ్ ఫిష్’ అనే శీర్షికతో ఉన్న ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, శాస్త్రవేత్తలు ఇటీవల కరంజీలోని ఒక అన్వేషించని ప్రాంతంలో ‘లేక్ సంసార’ అనే సరస్సులో ఒక చేపను కనుగొన్నారు. దీనికి హోమో పిస్సిస్ లేదా Human faced fish (మానవ ముఖం గల చేప) అని పేరు పెట్టారు.
ముందుగా, కరంజి అనే ప్రాంతం గాని సంసార పేరుతో సరస్సు గాని లేవు అనని ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ ద్వారా మాకు తేలింది. భారతదేశంలోని కర్ణాటకలోని మైసూరులో కరంజి అనే సరస్సు ఉంది, అయితే ఇటీవల అక్కడ ఇలాంటి జాతి చేప కనుగొనబడిందనే వైరల్ వాదనకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవు.
అలాగే, శాస్త్రవేత్తలు కనుక ఇలాంటి చేపని కనుగొని ఉంటే, అది మీడియా ద్వారా విస్తృతంగా రిపోర్టు చేయబడేది, కానీ, నైలు నదికి సమీపంలో ఉష్ణమండల సరస్సులో మానవ ముఖం గల చేప కనుగొనబడింది అనే ఈ వాదనకు మద్దతు ఇచ్చే ఎటువంటి వార్తా కథనాలు లేదా శాస్త్రీయ ఆధారాలు కూడా మాకు దొరకలేదు. ఉత్తర అమెరికా మరియు ప్రపంచంలోని మొక్కలు, జంతువులు, fungi (శిలీంధ్రాలు) మరియు సూక్ష్మజీవులపై అధికార వర్గీకరణ సమాచారాన్ని కలిగి ఉండే ‘ఇంటిగ్రేటెడ్ టాక్సానామిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’లో కూడా ఈ హోమో పిస్సిస్ చేప జాతుల పేరు మాకు దొరకలేదు.
వైరల్ వీడియోను అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ ‘హెడ్‌టాప్ వీడియోస్’ గ్రాఫిక్స్ బేస్డ్ వీడియోలను అప్‌లోడ్ చేస్తుందని మేము కనుగొన్నాము. ఈ ఛానల్ వివరణలో Experiments in video and Graphic అని ఉంది. వైరల్ వీడియో AI-ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన వీడియో అయ్యుండొచ్చు అనే అనుమానంతో, మేము AI- రూపొందించిన చిత్రాలను గుర్తించే హైవ్ AI డిటెక్టర్ ద్వారా వైరల్ వీడియో యొక్క కొన్ని స్క్రీన్‌షాట్‌లను రన్ చేసాము . ఈ విజువల్స్ AIని ఉపయోగించి రూపొందించబడి ఉండవచ్చు అని, దీనికి దాదాపు 99.4% అవకాశం ఉందని హైవ్ AI డిటెక్టర్ రిజల్ట్ వచ్చింది.
చివరిగా, శాస్త్రవేత్తలు ఇటీవల హోమో పిస్సిస్ అనే మానవ ముఖం గల చేప జాతిని కనుగొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.