22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. కాకపోతే, 25 ఏప్రిల్ 2025న తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన కొత్త ప్రకటనలో, TRF పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం లేదని, అంతకు ముందు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని తెలిపింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ).
పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి పాక్ సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది, భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది.
ఈ నేపథ్యంలో,“పాకిస్తాన్ గనుక భారత్ మీద దాడి చేస్తే నేను చూస్తూ కూర్చోను, పాకిస్తాన్‌ను ధ్వంసం చేసి పడేస్తా, ఎందుకంటే మోదీజీ నా స్నేహితుడు, భారతీయులను నేను ప్రేమిస్తాను”, అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “పాకిస్తాన్ గనుక భారత్ మీద దాడి చేస్తే నేను చూస్తూ కూర్చోను, పాకిస్తాన్‌ను ధ్వంసం చేసి పడేస్తా, ఎందుకంటే మోదీజీ నా స్నేహితుడు, భారతీయులను నేను ప్రేమిస్తాను”, అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఇది AI ద్వారా రూపొంచించబడిన వీడియో. అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించారు. అసలు వీడియోను 15 సెప్టెంబర్ 2016న ఎకనామిక్ క్లబ్ ఆఫ్ అమెరికాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ సభలో ఎక్కడా ట్రంప్ ఇండియా లేదా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై దాడిలో భారత్‌కు మద్దతు తెలుపుతున్నానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్, పాకిస్తాన్ రెండూ తనకి మిత్రదేశాలేనని, కాశ్మీర్ సమస్యని ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తే తాను పాకిస్తాన్‌ను ధ్వంసం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలుచేసినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి. అలాగే మేము ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా పరిశీలించాము, అక్కడ కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు.
ఇకపోతే ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం , వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియో లభించింది. ఈ వీడియోని మీడియా సంస్థ ‘CNN’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 16 సెప్టెంబర్ 2016న షేర్ చేసినట్లు గుర్తించాము. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో 15 సెప్టెంబర్ 2016న ఎకనామిక్ క్లబ్ ఆఫ్ అమెరికాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.
ఈ సభలో ఎక్కడా ట్రంప్ ఇండియా లేదా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. ఈ ఎన్నికల సభకు సంబంధించిన వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ సభలో ట్రంప్ చేసిన పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినట్లు అర్థమవుతుంది. తదుపరి ఈ వీడియో AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్ Hive ని ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియోలోని ఆడియో 99% AI-జనరేటెడ్ ఆడియో కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది.

ఇక పహల్గాం ఉగ్రదాడిపై ఈ ఘటనను ఖండిస్తూ ఉగ్రవాదంపై దాడిలో భారత్‌కు మద్దతు తెలుపుతామని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు. అయితే, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), “నాకు భారత్, పాకిస్తాన్ రెండిటితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాలు కాశ్మీర్‌లో వెయ్యి సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాయి. కాశ్మీర్ సమస్య వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతోంది, బహుశా దాని కంటే ఎక్కువే కావచ్చు. అది(ఉగ్రవాద దాడి) నీచమైన చర్య. ఆ సరిహద్దులో 1,500 సంవత్సరాలుగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇది అలాగే ఉంది, కానీ వారు ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కారించుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు ఇద్దరు నాయకులు తెలుసు. పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్రమైన ఉద్రిక్తత ఉంది ప్రస్తుతమే కాదు, ఎప్పటినుంచో ఉంది” అని అన్నారు.
చివరగా, ఇటీవల భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తే తాను పాకిస్తాన్‌ను ధ్వంసం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నట్లుగా AI ద్వారా రూపొందించిన వీడియోని షేర్ చేస్తున్నారు