ఏనుగు వంటి తొండం మరియు చెవులతో ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక శిశువు జన్మించింది అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఏనుగు పోలికలతో ఒక మానవ శిశువు ఆంధ్ర ప్రదేశ్లో జన్మించింది
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని మోరోకో దేశానికి చెందిన ‘Ali Aboutine’ అనే AI ఆర్టిస్ట్ తయారు చేశాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా అసలు ఇలాంటి సంఘటన ఆంధ్ర ప్రదేశ్‌లో నిజంగా జరిగిందా అని చెక్ చేయడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, మాకు ఈ విషయాన్ని గురించి వచ్చిన ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. ఇలాంటి వింత అరుదైన సంఘటన కనుక నిజంగానే మన దగ్గర జరిగి ఉంటే దాన్ని వార్తా పత్రికలు ప్రచురించకుండా ఉండవు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న జీవి నిజమైన శిశువు కాదు, AI ద్వారా రూపొందించిన జీవీ అనే అనుమానంతో మేము ఈ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ‘Hugging Face’ వారి AI డిటెక్టర్‌లో చెక్ చేస్తే ఈ వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేశారు అని మాకు రిపోర్ట్ వచ్చింది.
ఆ తర్వాత, వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేస్తే, ఈ వీడియోని మాకు ‘Ali Aboutine’ అనే ఒక డిజిటల్ క్రియేటర్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంటులో దొరికింది. ఈ వీడియోను తను 8 సెప్టెంబర్ 2024న అప్లోడ్ చేశాడు.
“Cutest little bundle of joy with a trunk full of love! 🐘💖 #BabyElephantVibes #AdorableCreation #TooCuteToHandle #elephantlover #MythicalCreatures” అనే క్యాప్షన్‌తో తను ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో దొరికింది అని కానీ, నిజమైన సంఘటన అని కానీ ఎక్కడ అతను చెప్పలేదు. నిజానికి, ఇతను ఒక AI ఆర్టిస్ట్. ఇతని ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇటువంటి AI జనరేటెడ్ వీడియోలు చాలా ఉన్నాయి.
ఇదే విషయంపై Ali విశ్వాస్ న్యూస్ వారితో మాట్లాడుతూ, తన పేజీలో ఉన్న కంటెంట్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినదే అని, ఈ వీడియోని కూడా తను AI ఉపయోగించి తయారు చేశాడని చెప్పాడు.
ఈ విషయంపై తన కామెంట్ కోసం మేము ‘Ali’ని సంప్రదించగా, తను ఈ వీడియోను AI ఉపయోగించి తయారు చేసాడని మాకు చెప్పాడు. “నేను తయారు చేసిన ఈ వీడియోని చాలా మంది తప్పుగా “గణేష్ బేబీ” అని షేర్ చేస్తున్నారు. నాకు అసలు (గణేష్) చతుర్థి పండుగ గురించి తెలియదు. మీరు నా పోస్ట్ యొక్క ఒరిజినల్ టైటిల్ చుస్తే అందులో నేను ఎక్కడా కూడా గణేష్ అని కానీ వేరే ఏ భారతీయ దేవుడు అని కానీ చెప్పలేదు.” అని తన స్పందనలో పేర్కొన్నాడు.
చివరిగా, ఏనుగు పోలికలతో ఒక మానవ శిశువు ఆంధ్ర ప్రదేశ్లో జన్మించింది అని చెప్తూ ఒక AI జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.
వివరణ (19 September 2024): ఈ ఆర్టికల్‌ను Ali ఇచ్చిన వివరణతో అప్డేట్ చేయడం జరిగింది.