సముద్రంలో ఒక గొయ్యి ఏర్పడి, నీరు ఉబుకుతున్నట్లు కనిపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కొంతమంది నిపుణులు దీన్ని సముద్రపు అడుగున జ్వాలాముఖి చలనం లేదా భూమి పలకల కదలికల ప్రభావంగా చెబుతున్నారు!’ అని చెప్తూ, ఇప్పటివరకు అసలైన కారణం తెలియలేదు, ఇది పెద్ద భూకంపం లేదా సునామీకి సంకేతం కావచ్చు అంటూ సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక నిజమైన గొయ్యిని (సింక్ హోల్) చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. సునామి లేదా భూకంపం ముప్పు కలుగచేసే పెద్ద గొయ్యి, సముద్ర గర్భంలో ఇటీవల ఏర్పడినట్లు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్నటువంటి దృశ్యాల గురించి, ఇటీవల కాలంలో వచ్చిన ఎటువంటి వార్తా కథనాలు ఏవీ మాకు లభించలేదు. అలాగే, ఇటీవల, వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు భూకంపం లేదా సునామీ కలుగజేసే గొయ్యి, సముద్రంలో ఏర్పడినట్లు కూడా మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.
ఇక వైరల్ వీడియో విషయానికి వస్తే, దాని గురించి మరిన్ని వివరాల కోసం అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో యొక్క అసలు వర్షన్ మాకు టిక్ టాక్‌లో లభించింది. dr.vea అనే పేజీలో ఈ వీడియోని 29 జూన్ 2025న ‘SINKHOLE captured by drone’ అంటూ అప్లోడ్ చేశారు.

అయితే ఈ వీడియోకి ‘Creator labelled as AI-generated’ అనే లేబుల్ ఉంది. ఈ కంటెంట్ అప్లోడ్ చేసిన వారు ఈ వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేశారు అని దీని అర్థం. dr.vea టిక్ టాక్ పేజిలో ఇటువంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలో ఉన్నాయి.


ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి Hive అనే AI డిటెక్షన్ టూల్ ఉపయోగించి చూడగా, ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినది అని అది స్పష్టం చేసింది.

బ్లూ హోల్ (నీలి రంధ్రాలు) లేదా అండర్‌వాటర్ సింక్ హోల్ (నీటి అడుగున ఏర్పడే సింక్ హోల్) అని అంటారు. బ్లూ హోల్స్ ప్రకృతి సహజంగా సముద్ర గర్భంలో ఏర్పడతాయి. ఇవి చాలా వరకు సముద్ర గర్భంలో ఉన్న సున్నపురాయిలో వందల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న నీటికి కరిగిపోవడం వల్ల ఏర్పడతాయి.

ఆస్ట్రేలియాలో గ్రేట్ బారియర్ రీఫ్ యందు ఉన్న సింక్ హోల్, బెలిజేలో ఉన్న గ్రేట్ బ్లూ హోల్ (ఇక్కడ, ఇక్కడ), గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని ‘గ్రీన్ బనానా’, బ్లూ హొల్స్‌కి కొన్ని ఉదాహరణలు. సింక్ హోల్స్ నీటిలోనే కాకుండా, భూమి ఉపరితలం మీద కూడా ఏర్పడతాయి.

చివరగా, వైరల్ అవుతున్న వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినది, నిజంగా సముద్రంలో ఏర్పడ్డ గొయ్యి (సింక్ హోల్) కాదు.