రాహుల్ గాంధీ మలేషియాలో ఇస్లామిక్ బోధకుడు, ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జాకీర్ నాయక్‌తో కలిసినప్పటి దృశ్యాలంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). చాలా మంది దీన్ని నిజమైన ఫోటోగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాహుల్ గాంధీ మలేషియాలో ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జాకీర్ నాయక్ ను కలిసినప్పటి ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. దీంట్లోని దృశ్యాలు AI ద్వారా రూపొందించబడ్డాయని Hive AI-డిటెక్షన్ టూల్ కూడా నిర్ధారించింది. అసలు ఫోటో జాకీర్ నాయక్, అతని కుమారుడు ఫారిక్ ఒమన్ గ్రాండ్ ముఫ్తీ షేక్ అహ్మద్ బిన్ హమద్ అల్ ఖలీలిని ఒక సమావేశంలో కలిసినప్పటిది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, దిగువ కుడి మూలలో ChatGPT వాటర్‌మార్క్‌ను మేము గమనించాము.

తదుపరి ఈ వైరల్ ఫోటో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ ఫోటో 98% AI– జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

ఈ వైరల్ ఫోటో మూలాన్ని తెలుసుకోవడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తూ 23 మార్చి 2023న ప్రచురితమైన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, ఈ ఫోటో వాస్తవానికి జాకీర్ నాయక్, అతని కుమారుడు ఫారిక్ ఒమన్ గ్రాండ్ ముఫ్తీ షేక్ అహ్మద్ బిన్ హమద్ అల్ ఖలీలిని ఒక మీటింగ్‌లో కలిసినప్పటిది అని పేర్కొనబడింది. దీన్ని బట్టి వైరల్ ఫోటోలో రాహుల్ గాంధీ ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేసినట్లు స్పష్టమవుతోంది.


రాహుల్ గాంధీ ఫోటో 05 మార్చి 2025న నవభారత్ టైమ్స్ యూట్యూబ్ చానెల్‌లో ప్రచురించబడిన ఒక వీడియో నుంచి తీసినదని మేము గుర్తించాము. ఆ వీడియోలో ఆయన లండన్‌లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే వస్త్రధారణలో కనిపించారు.
అయితే, రాహుల్ గాంధీ మలేషియాలో జాకీర్ నాయక్‌ను కలిశాడా లేదా అని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, ఈ వైరల్ ఫోటో నిజమైనది కాదని, అది AI ద్వారా రూపొందించబడిందని నిర్ధారించవచ్చు.
చివరిగా, రాహుల్ గాంధీ మలేషియాలో జాకీర్ నాయక్‌తో కలిసినప్పటి దృశ్యాలంటూ AI ద్వారా ఎడిట్ చేయబడిన ఫోటోను షేర్ చేస్తున్నారు.