Fact Check, Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై టాక్స్ తగ్గించిన నేపథ్యంలో పెట్రోల్‌పై విధించే పన్నులకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు

0

Update (21 November 2022):

పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ఒక్క లీటర్ కు రూ. 19.50 పన్ను వసూలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ. 41.55 పన్ను వసూలు చేస్తుంది అంటూ ఒక పోస్ట్ చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే ఇదే పోస్టుని గత సంవత్సరం కూడా ఇవే గణాంకాలతో షేర్ చేసారు. అప్పటికింకా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై టాక్స్ తగ్గించలేదు.

అయితే 16 November 2022న ఢిల్లీకి సంబంధించిన ప్రైస్ బిల్డప్ ఇక్కడ చూడొచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో పేర్కొన్న ప్రాధమిక రేటు, డీలర్ కమిషన్ తప్పని అర్థం అవుతుంది.

అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.2% VATను విధిస్తుంది. అంటే 16 November 2022 ప్రైస్ బిల్డప్ ప్రకారం వ్యాట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై వసూలు చేసే మొత్తం రూ. 28.52. దీని వళ్ళ తెలంగాణలో రిటైల్ పెట్రోల్ ధర లీటర్ కి రూ. 109.53 ఉంటుంది. పూర్తి వివరాల ఇంతకు ముందు ప్రచురించిన ఆర్టికల్ ని క్రింద చదవండి.

Published (23 May 2022):

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/డీజిల్‌పై పన్ను తగ్గించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై వసూలు చేస్తున్న పన్నులు/పెట్రోల్ ధరలు మొదలైన అంశాలకు సంబంధించి తప్పుడు సమాచారం సోషల్ మీడియా పోస్టుల ద్వారా  విస్తృతంగా షేర్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికన్నా అధికంగా రూ. 35.2 వసూలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం సెస్ కాకుండా రాష్ట్రానికి వాటా ఉండే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని, లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో తెలంగాణ ప్రభుత్వానికి రూ. 0.58 పైసల వాటా వస్తుందని, ఇలా క్లెయిమ్ చేస్తున్న పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఈ పోస్టులలో షేర్ అవుతున్న సమాచారానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రం పెట్రోల్‌పై రూ. 35.2 టాక్స్ వసూలు చేస్తోంది ; కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్/డీజిల్‌లో రాష్ట్రాలకు వాటా ఉండే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది, సెస్‌ను కాదు.

ఫాక్ట్ (నిజం):  ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై తగ్గించిన రూ.8, రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ నుండి తగ్గించింది, రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ నుండి కాదు. ఐతే కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీలో తెలంగాణ రాష్ట్రానికి వాటా కింద కేవలం ఒక పైసా మాత్రమే వస్తుంది. ఇకపోతే తగ్గించిన ధరల అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి లీటర్ పెట్రోల్‌పై నికరంగా రూ. 28.53 ఆదాయం వస్తుంది. కేంద్రానికి మాత్రం రూ.19.33 ఆదాయం వస్తుంది. టాక్స్ తగ్గించక ముందు మాత్రం కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఇంచుమించు ఒకేలా ఆదాయం వచ్చేది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 8 మరియు లీటర్ డీజిల్‌పై రూ. 6 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనంతరం ఎవరెంత (కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం) టాక్స్ వసూలు చేస్తున్నారు, కేంద్ర టాక్స్ తగ్గిస్తే రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందా, అసలు కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది మొదలైన అంశాల గురించి కింద  కూలంకషంగా చూద్దాం.

అసలు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ఏ రూపంలో వసూలు చేస్తుంది:

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని నాలుగు రూపాలలో (బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (సెస్) + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ + అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్) వసూలు చేస్తుంది.  ఈ నాలుగింటిలో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని (రూ.1.40) మినహాయిస్తే మిగిలిన మూడు సెస్ రూపంలో వసూలు చేస్తుంది.

పైగా సెస్ రూపంలో వసూలు చేసిన వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి వాటా ఉండదు, ఇవి పూర్తిగా కేంద్ర ఖజానాకే చెందుతుంది. అంటే కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే దాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది.

కేంద్రం టాక్స్ తగ్గిస్తే రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందా ?

రాష్ట్ర ప్రభుత్వాలకు సాధారణంగా పెట్రోల్/డీజిల్‌పై రెండు మార్గాలలో ఆదాయం చేకూరుతుంది, 1) కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రానికి వచ్చే వాటా 2) రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే సేల్స్ టాక్స్/VAT.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తగ్గించి రూ.8 పూర్తిగా రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూపంలో వసూలు చేసేదాంట్లో నుండి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కాబట్టి  బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు వచ్చే వాటాలో ఎటువంటి మార్పు ఉండదు.

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ టాక్స్/VAT తగ్గించకపోయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం టాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. ఇది ఎలా అని తెలుసుకోవాలంటే ముందు మనం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్/డీజిల్‌పై సేల్స్ టాక్స్/VAT లెక్కించే విధానం గురించి తెలుసుకోవాలి.

రాష్ట్రాలు VAT లెక్కించే విధానం:-  రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్/డీజిల్‌పై విధించే సేల్స్ టాక్స్/VAT మూడు అంశాలపై ఆదారపడి ఉంటుంది, 1) ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుండి పెట్రోల్ కొనుగోలు చేసే ధర, 2) కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ మరియు 3) డీలర్ కమిషన్.

ఈ మూడింటిని కలిపితే వచ్చినదానిపై ఒక్కో రాష్ట్రం ఒక్కో పర్సెంటేజ్ (శాతం) చొప్పున సేల్స్ టాక్స్/VAT వసూలు చేస్తాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఇలానే సేల్స్ టాక్స్/VATను లెక్కిస్తాయి. అంటే అన్ని రాష్ట్రాల సేల్స్ టాక్స్/VAT అనేది కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా ఆదారపడి ఉంటుంది.

పైన చెప్పినట్టు (బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మరియు సెస్‌ల) నాలుగు కలిప్తే ఎక్సైజ్ డ్యూటీ అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించకుండా కేవలం సెస్ తగ్గించినా కూడా రాష్ట్రాలకు వచ్చే సేల్స్ టాక్స్/VAT తగ్గుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ (సెస్ లేదా బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ) పెంచినప్పుడు, రాష్ట్రాలకు  సేల్స్ టాక్స్/VAT నుండి వచ్చే ఆదాయం కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.  ఉదాహారణకు ఢిల్లీకి సంబంధించిన ప్రైస్ బిల్డప్ పైన చూడొచ్చు.

దీని ప్రకారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 8 సెస్ తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఎనిమిది రూపాయలలో తాము విధించే VAT నిష్పత్తిలో ఆదాయాన్ని కోల్పోతాయి. ఉదాహారణకి తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 35.2% VAT వసూలు చేస్తుంది, అంటే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తగ్గించిన రూ. 8లో 35.2%( అంటే లీటర్ పెట్రోల్‌పై రూ. 2.82) ఆదాయం తగ్గుతుంది.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో ఎంత వాటా వస్తుంది :

 ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పినట్టు పెట్రోల్/డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసేదాంట్లో నుండి మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద లీటర్ పెట్రోల్‌పై రూ. 1.40 వసూలు చేస్తుంది, అంటే కేవలం ఈ రూ.1.40 లో రాష్ట్రాలు వాటా ఉంటుంది.

15వ ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదన మేరకు సెస్స్‌లు మినహాయిస్తే కేంద్రం వసూలు చేసే పన్నులలో రాష్ట్రాలకు 41% వాటా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని రాష్ట్రాలకు కలిపి 41% వాటా ఉంటుంది, ఒక్కో రాష్ట్రానికి 41% కాదు. అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చే 41% వాటాను కేవలం ఒక రాష్ట్రానికే 41% వస్తుందని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.

మళ్ళీ ఈ 41%లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉండాలో కూడా  ఫైనాన్స్ కమిషన్ (అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని) సూచిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాలకు చెందే 41%లో తెలంగాణ రాష్ట్రానికి 2.13% వాటా ఉండాలని ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించింది.

అంటే కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై వసూలు చేసే రూ. 1.40 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో అన్ని రాష్ట్రాలకు కలిపి 41%, అనగా రూ. 0.57 వాటా ఉంటుంది. మిగిలిన 59%, అనగా రూ.0.83 కేంద్ర ఖజానాకు చేరుతుంది. ఇకపోతే అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చే రూ.0.57 వాటాలో తెలంగాణ రాష్ట్రానికి 2.13%, అంటే రూ.0.01 (ఒక పైసా) వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే రూ.19.90 (ఇటీవల టాక్స్ తగ్గించిన తరవాత) ఎక్సైజ్ డ్యూటీలో  తెలంగాణకు వాటా కింద కేవలం ఒక పైసా మాత్రమే వస్తుంది.

కేంద్ర ఇటీవల టాక్స్ తగ్గించిన అనంతరం లీటర్ పెట్రోల్‌పై ఎవరు ఎంత వసూలు చేస్తున్నారు :

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌పై వసూలు చేసే రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్‌లో రూ. 8 తగ్గిస్తున్నామని స్పష్టం చేసింది. ఐతే ఈ తగ్గింపు అనంతరం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ. 19.90 వసూలు చేస్తోంది (రూ. 18.50 వివిధ సెస్‌ల రూపం + రూ.1.40 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ). ఈ ఎక్సైజ్ డ్యూటీలో సెస్ రూపంలో ఎంత మరియు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఎంత అనేది కింది టేబుల్‌లో చూడొచ్చు.

ఐతే సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తం కేంద్రానిదే కాబట్టి రూ. 18.50 మరియు రూ.1.40 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో కేంద్ర వాటా 59% కింద రూ. 0.83, మొత్తం కలుపుకొని లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం నికరంగా రూ. 19.33 వసూలు చేస్తుంది.

ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.2% VATను విధిస్తుంది. అంతకుముందు (31% + రూ. 2గా) రాష్ట్ర VAT ఉండగా, దీనికి 2015లో  మార్పులు చేసి 35.2%గా నిర్ణయించారు. 2015 తరవాత తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మళ్ళీ పెట్రోల్/డీజిల్‌పై VAT మార్చలేదు.

ఐతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాక్స్ తగ్గించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 28.52లను VAT రూపంలో వసూలు చేస్తోంది (పైన తెలిపిన ప్రైస్ బిల్డప్ ప్రకారం). దీనికి అదనంగా ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా కింద వచ్చే రూ. 0.01 కలుపుకొని మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 28.53 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది.

అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టాక్స్ తగ్గించిన అనంతరం లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వానికి నికరంగా రూ.19.33 ఆదాయం చేకూరుతుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 28.53 ఆదాయం చేకూరుతుంది. ఉదాహారణకి ఈ రోజు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 అనుకుంటే, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి  రూ.19.33 మరియు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 28.53 ఆదాయం వస్తుంది.

ఐతే ఎనిమిది రూపాయల టాక్స్ తగ్గించక ముందు మాత్రం లీటర్ పెట్రోల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం రెండు కూడా ఇంచుమించు ఒకే విధంగా పన్ను వసూలు చేసేవి. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై టాక్స్ తగ్గించిన నేపథ్యంలో పెట్రోల్‌పై విధించే పన్నులకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll