Fake News, Telugu
 

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అకస్మాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాకిస్తాన్‌లో వరదలు సంభవించాయి అంటూ సంబంధంలేని వీడియోలను షేర్ చేస్తున్నారు

0

22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడఇక్కడ). పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని  48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

పలు వార్త కథనాల ప్రకారం (ఇక్కడ & ఇక్కడ), భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జీలం నదిలో భారతదేశం అకస్మాత్తుగా అదనపు నీటిని విడుదల చేయడం వల్ల జీలం నదికి ఆకస్మిక వరదలు వచ్చాయని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్‌లోని అనేక మీడియా సంస్థలు జీలం నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగిందని రిపోర్ట్ చేశాయి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారతదేశం నీటిని విడుదల చేసినట్లు పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్‌లోని మసీదులు ప్రజలు జీలం నది దగ్గరకు వెళ్ళ వద్దు అని పదే పదే ప్రకటనలు చేస్తున్నాయని పాకిస్థాన్ మీడియా రిపోర్ట్ చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ విషయంపై భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఈ నేపథ్యంలో, “భారతదేశం అకస్మాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాకిస్తాన్‌లో వరదలు సంభవించాయి” అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశం అకస్మాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాకిస్తాన్‌లో వరదలు సంభవించాయి, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలకు పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదు. మొదటి వీడియో దక్షిణ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఆగస్ట్/సెప్టెంబర్ 2022లో సంభవించిన వరదలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. రెండవ వీడియో 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జీలం నదిలో భారతదేశం అకస్మాత్తుగా అదనపు నీటిని విడుదల చేయడం వల్ల జీలం నదికి ఆకస్మిక వరదలు వచ్చాయని పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్లు పలు వార్త కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంపై భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో-1:

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 02 సెప్టెంబర్ 2022న ‘BBC News’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 26 ఏప్రిల్ 2025న షేర్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియో వివరణ ప్రకారం, వైరల్ వీడియో దక్షిణ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని దాదు జిల్లాలో ఆగస్ట్/సెప్టెంబర్ 2022లో సంభవించిన వరదలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఇటీవలది కాదని, ఇది 2022 నాటిది అని స్పష్టమవుతోంది. 2022లో దక్షిణ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో సంభవించిన ఈ వరదలకు సంబంధించిన మరిన్ని రిపోర్ట్స్ ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

వీడియో-2:

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను 17 ఏప్రిల్ 2025న X(ట్విట్టర్)లో ఒక యూజర్ షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేసినట్లు మేము కన్నుగొనము. ఈ వీడియో వివరణ ప్రకారం, వైరల్ వీడియో పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని (Khyber Pakhtunkhwa province) బట్టాగ్రామ్ జిల్లాలోని తహసిల్ అల్లై ప్రాంతంలో ఉన్న థాకోట్ బజార్‌లో సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదలను సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.

ఈ సమాచారం ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఇటీవల 16 ఏప్రిల్ 2025న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రొవిన్స్ లో (Khyber Pakhtunkhwa province) భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చినట్లు పలు పాకిస్తానీ మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), పలు సోషల్ మీడియా పోస్టులు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వైరల్ అవుతున్న వీడియో ఎప్పడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, అందుబాటులో సమాచారం బట్టి ఈ వీడియోకు పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

వీడియో-3:

“భారతదేశం అకస్మాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాకిస్తాన్‌లో వరదలు సంభవించాయి” అంటూ మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఈ వీడియోకు కూడా పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉంది.  ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) 04 మే 2024న ఇన్‌స్టాగ్రామ్ ఓ యూజర్ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో పాకిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రొవిన్స్ లోని దుబేర్ వ్యాలీలో భారీ వర్షాలు, వరదలను చూపిస్తుందని పోస్టు వివరణంలో పేర్కొన్నారు. వైరల్ అవుతున్న వీడియో ఎప్పడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, అందుబాటులో సమాచారం బట్టి ఈ వీడియోకు పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం అకస్మాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాకిస్తాన్‌లో వరదలు సంభవించాయి అంటూ సంబంధంలేని వీడియోలను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll