Fake News, Telugu
 

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో I.N.D.I. కూటమి పొత్తు గురించి చర్చించడానికి అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు పాత ఫోటోను షేర్ చేస్తున్నారు

0

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 04 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. 2019 లోక్‌సభ ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో బీజేపీకీ సీట్లు తగ్గాయి. బీజేపీ 240 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 సీట్లను బీజేపీ సొంతంగా సాధించడంలో విఫలమవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు NDA కూటమిలోని భాగస్వాములపై ​​ఆధారపడేలా చేసింది. ఇప్పుడు అందరి దృష్టి NDA కూటమిలో ప్రధాన మిత్రపక్షాలైన TDP మరియు JD(U) పైనే ఉంది. TDP ఆంధ్రప్రదేశ్ లో 16 సీట్లు గెలుచుకోగా, JD(U) బీహార్ లో 12 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే  I.N.D.I కూటమిలో సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ I.N.D.I. కూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్లు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ I.N.D.I కూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు, అందుకు సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసే సమయం వరకు మాకు ఎలాంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు. ఈ వైరల్ ఫోటో 2019  లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ వ్యతిరేక ఫ్రంట్‌ను స్థాపించే ప్రయత్నంలో భాగంగా 18 మే 2019న లక్నోలో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో తెలిపినట్టుగా, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారా?అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వీరు ఇద్దరు ఇటీవల అనగా 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత భేటీ అయినట్లు ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసే సమయం వరకు మాకు ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు. అలాగే రెండు పార్టీల, ఈ ఇద్దరు నేతల (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియా ఖాతాల్లో వెతకగా, అక్కడ కూడా వీరు ఇద్దరు సమావేశం అయినట్లు ఎటువంటి సమాచారం లభించలేదు.

అయితే, సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశం ఉంది అని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి.(ఇక్కడ & ఇక్కడ). కానీ, మాకు ఈ ఇద్దరు నేతలు సమావేశం అయినట్లు ఇప్పటివరకు (ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసే వరకు) ఎటువంటి సమాచారం లభించలేదు.

05 జూన్ 2024న ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “నేను అనుభవజ్ఞుడిని మరియు ఈ దేశంలో అనేక రాజకీయ మార్పులను చూశాను. మేం ఎన్డీయేలో ఉన్నాం, నేను ఎన్డీయే సమావేశానికి వెళ్తున్నాను” అని అన్నారు (ఇక్కడ & ఇక్కడ). అంతేకాకుండా, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు 05 జూన్ 2024న ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన NDA కూటమి పక్షాల భేటీలో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబధించిన వీడియో మరియు ఫోటోలను టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ షేర్ చేసింది (ఇక్కడ & ఇక్కడ).  

తదుపరి ఈ వైరల్ ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం, గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ 18 మే 2019న NDTV సంస్థ తమ వెబ్సైటులో పబ్లిష్ చేసిన కథనం లభించింది. ఈ వార్తా కథనం ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోడీ వ్యతిరేక ఫ్రంట్‌ను స్థాపించే ప్రయత్నంలో భాగంగా 18 మే 2019న చంద్రబాబు నాయుడు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (BSP) చీఫ్ మాయావతిని లక్నోలో కలిశారని తెలుస్తుంది.

ఇదే ఫోటోను 18 మే 2019లో అఖిలేష్ యాదవ్ తన అధికారిక X(ట్విట్టర్)లో షేర్ చేశారు. ఈ ఫోటో యొక్క వివరణలో, ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు లక్నో వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటికి సంబంధించిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో 2019లో జరిగిన అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటికి సంబంధించింది అని మనం నిర్థారించవచ్చు

చివరగా, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు ఎలాంటి విశ్వసనీయ సమాచారం లేదు, ఈ వైరల్ ఫోటో 2019లో జరిగిన భేటీకి సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll