నాటో అంబాసిడర్ ‘జూలియాన్నే స్మిత్’ మరియు అమెరికన్ సెనేటర్ ‘రో ఖన్నా’ భారత్‌ను నాటో కూటమిలోకి ఆహ్వానించారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: నాటో అంబాసిడర్ ‘జూలియాన్నే స్మిత్’ మరియు అమెరికన్ సెనేటర్ ‘రో ఖన్నా’ భారత్‌ను నాటో కూటమిలోకి ఆహ్వానించారు.
ఫాక్ట్: జూలియాన్నే స్మిత్ మరియు రో ఖన్నా భారత్‌ను నాటో ప్లస్ కూటమిలోకి ఆహ్వానించారు. నాటోలో భారత్‌తో పాటు ఇతర ఆసియా పసిఫిక్ దేశాలను సభ్యులుగా చేర్చుకునే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా 31 మార్చి 2023 న నిర్వహించిన మీడియా సమావేశంలో భారత ప్రతినిధులతో నాటో అధికారులు జరిపిన చర్చల గురించి జూలియాన్నే స్మిత్ మాట్లాడుతూ, భారత్ ఆసక్తి చూపితే నాటో కూటమి భారత్‌తో సన్నిహిత సంబంధాలకు సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు.
ఇదే సమావేశంలో భారత్ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా, ఆమె ఈ విధంగా అన్నారు, “(భారత్‌తో సహా) ఆసియా పసిఫిక్ దేశాలను నాటోలో సభ్యులుగా చేర్చుకునే ఆలోచన లేదు. నాటో అనేది యూరో-అట్లాంటిక్ మిలిటరీ కూటమిగానే ఉంటుంది. అక్కడి దేశాలకే ఇందులో చేరడానికి అవకాశముంటుంది. ఈ కూటమిని విస్తృతమైన ప్రపంచ కూటమిగా మార్చే ప్రణాళికలు లేవు.”
అయితే, నాటో ప్లస్ కూటమిలో ఉన్న సభ్యదేశాల మాదిరిగా భారత్ కూడా తమతో కలిసి పని చేయాలనుకుంటే అది ఆహ్వానించ దగ్గ విషయమేనని ఆమె చెప్పినట్లు ఉన్న మీడియా కథనాలను ఇక్కడ చూడవచ్చు.
నాటో ప్లస్ కూటమి అంటే ఏంటి?
నాటోలో సభ్యులుగా లేని దేశాలు నాటో కూటమితో సంబంధాలను ఏర్పరచుకుని వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు వాటిని నాటో ప్లస్ దేశాలుగా పిలుస్తారు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్ దేశాలు ఈ నాటో ప్లస్ దేశాలుగా ఉన్నాయి. వీటినే ‘నాటో+5’ అని కూడా అంటారు.
ఇక భారత్‌ను కూడా నాటో ప్లస్ దేశాల కూటమిలో చేర్చడానికి అమెరికా భావిస్తుందనీ అమెరికన్ రాజకీయ నాయకుడు రో ఖన్నా పేర్కొన్నాడు.
దీనికి సంబంధించి ‘National Defence Authorization Act (NDAA)’ లో తాను ప్రతిపాదించిన సవరణను అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిందని ఆయన చెప్పారు.
చివరిగా, భారత్‌ను అమెరికన్ అధికారులు ఆహ్వానించింది నాటో ప్లస్ కూటమిలోకి, నాటో కూటమిలోకి కాదు.