చైనాలో బాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. అలాగే చైనాలోని బ్యాంకులు నగదు విత్‌డ్రాలను నిలిపివేసాయని కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. బ్యాంకులు నగదు విత్‌డ్రాలను నిలిపివేసాయి.
ఫాక్ట్ (నిజం): చైనాలోని హెనాన్ ప్రొవిన్స్‌లోని నాలుగు గ్రామీణ బ్యాంకులు మరియు పక్కనున్న అన్హుయి ప్రొవిన్స్‌లోని రెండు గ్రామీణ బ్యాంకులు అక్రమ మార్గంలో స్థానికేతర కస్టమర్ల నుండి అధికంగా డిపాజిట్లు స్వీకరించాయన్న కారణానికి చైనా బ్యాంకింగ్ రెగ్యులేటర్ సంస్థ ఈ బ్యాంకుల నుండి విత్‌డ్రాలను నిలిపివేసింది. ఇందువల్ల ఈ ప్రాంతాలలో కస్టమర్లు నిరసనలు చేస్తున్నారు. ఐతే ఈ ఘటనలు కేవలం ఈ రెండు ప్రొవిన్స్‌లకు మాత్రమే పరిమితం. చైనా బ్యాంకింగ్ రంగంలో ఈ రూరల్ బ్యాంకుల వాటా చాలా తక్కువ కావడంతో ప్రస్తుతానికి బ్యాంకింగ్ రంగానికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు తెలిపారు. కాబట్టి కేవలం ఈ ఘటనల ఆధరంగా మొత్తం చైనా బ్యాంకింగ్ రంగం కుప్పకూలిపోతుందనడం అతిశయోక్తి అవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇటీవల కాలంలో చైనాలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రజలు నిరసనలు జరుపుతున్న మాట నిజమైనప్పటికీ, ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా జరగట్లేదు. కేవలం పలు ప్రొవిన్స్‌లకు మాత్రమే ఇవి పరిమితం. ఈ సంవత్సరం (2022) ఏప్రిల్‌లో హెనాన్ ప్రొవిన్స్‌లోని నాలుగు గ్రామీణ బ్యాంకులు మరియు పక్కనున్న అన్హుయి ప్రొవిన్స్‌లోని రెండు గ్రామీణ బ్యాంకుల నుండి నగదు విత్‌డ్రాలను నిలిపివేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి.
అసలు ప్రజలు ఎందుకు నిరసనలు జరుపుతున్నారు:
సాధరణంగా చైనాలోని బ్యాంకింగ్ నియమాల ప్రకారం స్థానిక లోకల్ బ్యాంకులు కేవలం తమ ప్రాంతంలోని స్థానిక కస్టమర్ల నుండి మాత్రమే డిపాజిట్లు తీసుకోవాలి, స్థానిక ప్రాంతానికి వెలుపలి కస్టమర్ల నుండి డిపాజిట్లు తీసుకోడానికి అనుమతి ఉండదు.
కానీ, పైన తెలిపిన బ్యాంకులు స్థానికేతర కస్టమర్ల నుండి అధికంగా డిపాజిట్లు స్వీకరించాయని, పైగా ఈ బ్యాంకులు అక్రమ మార్గంలో అధిక వడ్డీ ఇస్తామని చెప్పి స్థానికేతర కస్టమర్ల నుండి అధికంగా డిపాజిట్లు స్వీకరించాయని తెలుపుతూ చైనా బ్యాంకింగ్ రెగ్యులేటర్ సంస్థ ఈ బ్యాంకుల నుండి విత్‌డ్రాలను నిలిపివేసింది.
ఇందువల్ల ఏప్రిల్ 2022 నుండి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఐతే కస్టమర్ల నుండి నిరసనలు ఎదురు కావడంతో ఈమధ్యే 50,000 యువాన్ల వరకు డిపాజిట్లు కలిగిన కస్టమర్లు విత్‌డ్రా చేసుకోవచ్చని చైనా బ్యాంకింగ్ రెగ్యులేటర్ ప్రకటించింది.
ఈ ఘటనల వల్ల చైనా బ్యాంకింగ్ రంగం కుప్పకూలనుందా ?
ఐతే కేవలం ఈ ఘటనల ఆధారంగా చైనా బ్యాంకింగ్ రంగం మొత్తం కుప్పకూలిందనడం సమంజసం కాదు. ఎందుకంటే కేవలం ఆర్ధిక మోసలకు పాల్పడ్డాయనే కారణంగా మాత్రమే ఈ బ్యాంకుల నుండి విత్‌డ్రాలు నిలిపివేయబడ్డాయే తప్ప వేరే ఆర్ధిక కారణాల వల్ల కాదు. పైగా ఈ ఘటనలు ముఖ్యంగా ఈ రెండు ప్రొవిన్స్‌లకు మాత్రమే పరిమితం, ఇతర ప్రొవిన్స్‌లలో వీటి ప్రభావం తక్కువే.
చైనా బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ చిన్న బ్యాంకుల వాటా చాలా తక్కవని, అలాగే ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న బ్యాంకులు కూడా కొన్నే కాబట్టి ఈ ఘటనల వల్ల ప్రస్తుతానికి బ్యాంకింగ్ రంగం కుప్పకూలే అంత ప్రమాదం లేదని ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. వివాదంలో ఉన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడొచ్చని వారు చేతున్నారు.
కోవిడ్ అనంతరం చైనా ఆర్ధిక వ్యవస్థ నెమ్మదించిందని వార్తా కథనాలు రిపోర్ట్ చేసినప్పటికీ, ప్రస్తుతం జరిగిన పరిణామాల వల్ల చైనా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందనడం అతిశయోక్తి అవుతుంది.
చివరగా, ప్రస్తుతం చైనాలో బ్యాంకులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పటికీ, ఈ నిరసనలు కేవలం రెండు ప్రొవిన్స్‌లకు మాత్రమే పరిమితం.