Fake News, Telugu
 

‘ప్రపంచంలో ఆర్థిక సంక్షోభ సమయంలో నల్లధనమే భారతదేశాన్ని కాపాడింది’ అనే అభిప్రాయాన్ని అఖిలేష్ యాదవ్ వ్యక్తపరచలేదు

0

ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో నల్లధనమే భారతదేశాన్ని కాపాడిందని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో నల్లధనమే భారతదేశాన్ని కాపాడిందని అఖిలేష్ యాదవ్ ఇటీవల పేర్కొన్నారు.

ఫాక్ట్ (నిజం): 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తరువాత అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో నల్లధనమే భారతదేశాన్ని కాపాడిందని ఆర్థికవేత్తలు విశ్లేషించి చెప్పారని పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలను తన సొంత అభిప్రాయంగా చెప్పలేదు. అంతేకాదు, నల్లధనానికి తాను కూడా వ్యతిరేకినని అఖిలేష్ యాదవ్ అప్పుడే మీడియాకు స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు గురించి అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయాలలో నల్లదనం భారత ఆర్థిక వ్యవస్థని కాపాడిన విషయం గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. అఖిలేష్ యాదవ్ మీడియాతో, “నల్లధనాన్ని నేను వ్యతిరేకిస్తాను. అయితే, ప్రపంచం ఆర్ధిక సంక్షోభంలో నెలకొన్న ప్రతిసారి భారత ఆర్ధిక వ్యవస్థను నల్లధనం యొక్క భారీ సమాంతర ఆర్ధిక వ్యవస్థే కాపాడిందని చాలా మంది ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు”, అని తెలిపారు.

అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్‌ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. నల్లధనానికి సంబంధించి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం, ఆర్థికవేత్తల విశ్లేషణలో తేలిన అభిప్రాయంగా మాత్రమే అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇది తన సొంత అభిప్రాయంగా అఖిలేష్ యాదవ్ చెప్పలేదు.

ప్రపంచంలో ఆర్థిక సంక్షోభంలో నెలకొన్న సమయాలలో నల్లధనం యొక్క సమాంతర ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థని కాపాడిందని ప్రపంచ బ్యాంక్ మాజీ ప్రధాన ఆర్థికవేత్త మరియు భారత ప్రభుత్వానికి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుడు, కౌశిక్ బసు తన ‘An Economist in the Real World’ పుస్తకంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ BBC సంస్థ 22 ఫిబ్రవరి 2016 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా అఖిలేష్ యాదవ్, నల్లధనం ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థని కాపాడిందంటూ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆర్థికవేత్తల అభిప్రాయంగా మాత్రమే తెలిపినట్టు స్పష్టమయ్యింది.

చివరగా, ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో నల్లధనం భారత ఆర్థిక వ్యవస్థని కాపాడిందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆర్థికవేత్తల అభిప్రాయంగా మాత్రమే పేర్కొన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll