ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత 10 ఏళ్లలో 40 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి నెట్టబడ్డారు అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత 10 ఏళ్లలో 40 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి నెట్టబడ్డారు.
ఫాక్ట్(నిజం): ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2005-06 నుంచి 2019-21 మధ్య 15 ఏళ్ల వ్యవధిలో 41.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-06లో దేశంలో దాదాపు 64.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికంలో ఉండగా, ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకు, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది. నీతి ఆయోగ్ ప్రకారం గత 5 ఏళ్లలో 13.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికం నుంచి బయటపడ్డారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని పేదరికానికి సంబంధించి అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచి (Multidimensional Poverty Index, MPI) విడుదల చేసింది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP), ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్ఐ)లు కలిసి ఈ నివేదికను రూపొందించాయి.
ఈ నివేదిక ప్రకారం 15 ఏళ్ల వ్యవధి (2005-06 నుంచి 2019-21)లో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-06లో 55.1 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికి 16.4 శాతానికి పడిపోయింది. అనగా 2005-06లో దేశంలో దాదాపు 64.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికంలో ఉండగా, ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకు, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది.
భారత్‌తో పాటు చైనా, కాంగో, ఇండోనేషియా మొదలైన 25 దేశాలు MPI విలువలను 15 ఏళ్లలో సగానికి తగ్గించుకున్నాయని పేర్కొంది. భారత దేశానికి సంబంధించి అంతకుముందు దేశంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రాలు, కులాలు, వర్గాలు ఈ కాలంలో మంచి పురోగతి కనబరిచారని ఈ నివేదిక పేర్కొంది.
ఐతే ఈ నివేదికను కొందరు తప్పుగా అర్ధం చేసుకొని భారత్‌లో పేదరికం పెరిగిందని, గత 10 ఏళ్లలో 40 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి నెట్టబడ్డారు అంటూ వార్తలు షేర్ చేస్తున్నారు.
గత 5 ఏళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు- నీతి ఆయోగ్:
ఇదిలా ఉండగా ఇటీవల నీతి ఆయోగ్ కూడా దేశంలోని పేదరికానికి సంబంధించి ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ ఆఫ్ రివ్యూ 2023’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. గత 5 ఏళ్లలో 13.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికం నుంచి బయటపడ్డారు అని నీతి ఆయోగ్ ఈ నివేదికలో పేర్కొంది. 2015-16లో 24.85 శాతంగా ఉన్న పేదరికం 2015-16 నాటికి 14.96 శాతానికి పడిపోయింది.
MPI యొక్క మొత్తం 12 పారామీటర్‌లు గుర్తించదగిన మెరుగుదలను నమోదు చేశాయని ఈ నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59% నుండి 19.28%కి తగ్గగా, అదే సమయంలో, పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.65% నుండి 5.27%కి తగ్గిందని తెలిపింది.
చివరగా, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత 15 ఏళ్లలో 41.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారు.