‘వైష్ణో దేవీ దర్శనానికి వెళ్తున్న కాన్వాయ్ పై జీహాదీల రాళ్ళ దాడులు..’ అని అంటూ, కొందరు వ్యక్తులు ఒక ఘాట్ రోడ్డుపై వెళ్తున్న కొన్ని వాహనాలపై రాళ్లు రువ్వుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: జమ్మూ & కశ్మీర్‌లోని వైష్ణో దేవి దేవాలయానికి వెళ్తున్న కాన్వాయ్‌పై ముస్లింలు రాళ్లు రువ్వుతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో భారతదేశం అధీనంలో ఉన్న జమ్మూ & కశ్మీర్‌లో తీసినది కాదు, పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబద్‌లో తీసినది. ఇటీవల కాలంలో భారతదేశం అధీనంలో ఉన్న జమ్మూ & కశ్మీర్‌లో ఉన్న శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై రాళ్లు రువ్విన సంఘటనలలు జరిగినట్లు ఎటువంటి వార్తా కథనాలు మాకు దొరకలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, మాకు ఈ మధ్య కాలంలో శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన ఘటన జరిగినట్లు మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.
ఇక వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం పాక్-ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది అని సూచిస్తున్న చాలా సోషల్ మీడియా పోస్టులు మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). కొన్ని పోస్టులలో ఇది ముజఫరాబద్‌లో ఉంది అని పేర్కొన్నారు యూజర్లు .

వీటి ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ ప్రదేశం నిజంగానే పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబద్‌లో ఉంది అని మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ). Shutterstock,istockphoto, flickr వంటి స్టాక్ ఫోటో వెబ్సైటులలో ఈ ప్రదేశం యొక్క ఫోటోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

అదనంగా, మేము ఇదే ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్స్‌లో కనుగొన్నాము, దీని పేరు లోహార్ గలి. ఇది పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబద్‌లోని అబొట్టాబాద్ రోడ్డులో ఉంది. ఇక్కడ నుంచే వైరల్ వీడియోని తీసారని దీని బట్టి మాకు స్పష్టం అయింది.

ఆ తర్వాత, ముజఫరాబద్‌లో వైరల్ వీడియోలో కనిపిస్తున్నటువంటి సంఘటన గురించి ఏవైనా వార్తా కథనాలు ప్రచురించబడ్డాయా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, మే 2024లో ముజఫరాబద్‌లో పెరుగుతున్న ఆహారం, ఇంధనం ధరలను ఉద్దేశించి కొందరు నిరసనలు చేపట్టారని, ఆ సమయంలో పాక్ సైన్యం యొక్క కాన్వాయ్‌పై కొందరు రాళ్లు రువ్వారని నివేదించిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. కానీ, ఈ సంఘటనకి, వైరల్ వీడియోకి సంబంధం ఏమైనా ఉందా అనే విషయం మేము స్వతంత్రంగా నిర్ధారించలేక పోయాము.

ఇదే వీడియోపై భారత ప్రభుత్వం యొక్క ఫాక్ట్ చెక్ సంస్థ PIB ఫ్యాక్ట్ చెక్ ‘X’ ద్వారా స్పందిస్తూ, కొందరు యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తూ, CISF మరియు CRPF జవాన్ల కాన్వాయ్‌పై జమ్మూ & కశ్మీర్‌లో దాడి జరిగిందని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారని చెప్పారు. ఈ క్లెయిమ్ ఫేక్ అని, ఇది పాక్-ఆక్రమిత కశ్మీర్‌లో చిత్రించిన ఒక పాత వీడియో అని వాళ్లు స్పష్టం చేశారు.
చివరగా, వైష్ణో దేవి దేవాలయానికి వెళ్తున్న వారిపై ముస్లింలు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలని చెప్తూ పాక్-ఆక్రమిత కశ్మీర్‌లో తీసిన ఒక వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.
గమనిక: 28 మే 2025న ఈ ఆర్టికల్ PIB ఫ్యాక్ట్ చెక్ వారి వివరణతో అప్డేట్ చేయబడింది